చెన్నై సమీపంలోని గూడువాంచేరిలో ఒడిశాకు చెందిన ఓ మహిళను అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన హయాత్ నిషా అనే మహిళ భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమె 19 ఏళ్ల కుమారుడు తాంబరంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా, హయాత్ నిషా మాత్రం గూడువాంచేరిలోని ఓ ఇంట్లో యువ దంపతులతో కలిసి ఉంటోంది.
ఈ క్రమంలో, గత 5వ తేదీన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రా వెళ్లిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా ఉన్న ఒక ఎరుపు రంగు సూట్‌కేసును పోలీసులు గుర్తించారు. దాన్ని తెరిచి చూసిన ఆగ్రా పోలీసులకు లోపల తల లేని మహిళ మొండెం, నరికిన శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే చెన్నై రైల్వే పోలీసుల సమన్వయంతో దర్యాప్తు చేపట్టగా, హత్యకు గురైన మహిళ హయాత్ నిషా అని నిర్ధారించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒక యువతీ యువకుడు ఆ సూట్‌కేసును రైలులో పెట్టి వెళ్లడం రికార్డయ్యింది. ఆ తర్వాత వారు పార్క్ రైల్వే స్టేషన్ మీదుగా లోకల్ ఎలక్ట్రిక్ రైలులో గూడువాంచేరికి పారిపోయినట్లు గుర్తించారు.
పోలీసులు గూడువాంచేరిలోని ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇల్లంతా రక్తపు మరకలు ఉండగా, బిర్యానీ వండే పెద్ద దబరా (అండా)లో హయాత్ నిషా శరీర మాంసపు ముక్కలను కూరగాయలతో కలిపి ఉంచి, పైన మైదా పిండి పూసి ఉంచారు. ఇది చూసిన పోలీసులు.. నిందితులు ఆమె శరీర భాగాలను వండే ప్రయత్నం చేశారా అనే కోణంలో విస్తుపోయారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ యువ జంట కోసం గూడువాంచేరి పోలీసులు మొబైల్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే, నిందితులు ఎక్కడో విసిరేసినట్లు భావిస్తున్న మహిళ తల కోసం కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Leave a Reply