ఢిల్లీ: భారత రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అనే ఒక ‘మీమ్’ రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో కోటి (10 మిలియన్) మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుని ఈ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది.
అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది?
మే 15న జరిగిన ఒక కోర్టు విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, యువతను ‘కాక్రోచ్ల’తో (బొద్దింకలతో) పోల్చారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి నిరసనగా, యువత ఆగ్రహంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పేరుతో ఒక వ్యంగ్య (Satirical) ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే, మే 16న న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, “తాను దేశ యువతను అనలేదని, నకిలీ పట్టాలతో వ్యవస్థల్లోకి ప్రవేశించే వారి గురించి మాత్రమే అన్నానని” వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియా గణాంకాలు..
ఈ పార్టీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
- కాంగ్రెస్ (@incindia): 13.2 మిలియన్ ఫాలోవర్లతో ప్రథమ స్థానంలో ఉంది.
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP): 10.3 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానానికి చేరింది.
- బీజేపీ (@bjp4india): 8.7 మిలియన్ ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది.
ప్రస్తుతం 56 పోస్ట్లతోనే ఈ స్థాయి ఆదరణ పొందడం గమనార్హం.
ఉద్యమ రూపం..
కేవలం మీమ్స్ పంచుకోవడానికే మొదలైన ఈ పేజీ, ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగ సమస్య, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, మరియు విద్యావ్యవస్థపై ఉన్న అసంతృప్తిని తెలియజేసే ఒక శక్తివంతమైన ‘డిజిటల్ ఉద్యమం’గా మారింది. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రఠీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి వారు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు, ఎక్స్ (ట్విట్టర్)లో ఈ ఖాతా వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో, దానిని హఠాత్తుగా నిలిపివేయడం గమనార్హం. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఈ పేజీ ఇంకా యాక్టివ్గా ఉంటూ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది.
