చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన థలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటిసారి పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అంతటా చర్చ జరుగుతోంది.
అయితే, విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఒక చిన్న సాంకేతిక చిక్కు ఉంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో TVK 108 సీట్లు గెలుచుకుంది, ఇది మెజారిటీ మార్కు (118) కంటే 10 సీట్లు తక్కువ. ఈ నేపథ్యంలో, విజయ్ను అధికారానికి దూరం చేయడానికి మహారాష్ట్ర, బీహార్ తరహా రాజకీయ వ్యూహాలు తమిళనాడులో అమలు అవుతాయా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం విజయ్ గవర్నర్ను కలిసి అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మెజారిటీ నిరూపించుకోవడానికి రెండు వారాల సమయం అడిగారు.
మహారాష్ట్ర తరహా ‘గేమ్’ జరిగితే విజయ్ పరిస్థితి ఏంటి?
2019 మహారాష్ట్ర ఎన్నికల ఉదాహరణను పరిశీలిస్తే.. అక్కడ బీజేపీకి అత్యధికంగా 105 సీట్లు వచ్చాయి. శివసేన (56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ (44) కలిసి విరుద్ధ భావజాలం ఉన్నప్పటికీ బీజేపీని అధికారానికి దూరం చేయడానికి ‘మహా వికాస్ అఘాడీ’గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ చివరకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.
బీహార్లో నితీష్-లాలు వ్యూహం
బీహార్లో కూడా నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ఒకరికొకరు బద్ధశత్రువులైనప్పటికీ, బీజేపీని అధికారానికి దూరం చేయడానికి రెండుసార్లు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో కూడా ఇలాంటి అపవిత్ర కూటమి ఏర్పడే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.
విజయ్ వద్ద ఉన్న మెజారిటీ ఫార్ములా ఏంటి?
ప్రస్తుతం TVK కి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్ రెండు చోట్ల గెలిచినందున ఒక సీటుకు రాజీనామా చేయాలి, అప్పుడు బలం 107 అవుతుంది. మెజారిటీకి కావాల్సిన 118 కోసం ఆయన కింది పార్టీల మద్దతు కోరుతున్నారు:
కాంగ్రెస్ (5), సిపిఐ (2), ఐయుఎంఎల్ (2) మరియు ఇతర చిన్న పార్టీల (DMDK, AMMK) మద్దతుతో విజయ్ సులభంగా మెజారిటీ సాధించగలరని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
విజయ్ను అడ్డుకునే వ్యూహం (ప్లాన్-బి) ఏంటి?
ఒకవేళ పాత ప్రత్యర్థులైన డీఎంకే (59) + ఏఐఏడీఎంకే (47) చేతులు కలిపితే.. వీరికి కాంగ్రెస్ (5), పీఎంకే (4) వంటి పార్టీలు తోడైతే బలం 119కి చేరుతుంది. జయలలితకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం డీఎంకేలో ఉన్న ఓ. పన్నీర్ సెల్వం (OPS) ను ముందు పెట్టి ఈ రెండు విరుద్ధ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, డీఎంకే-ఏఐఏడీఎంకే కలవడం అనేది అసాధ్యమని రాజకీయ నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
