బెంగళూరు: నంది హిల్స్‌కు ఒక రోజు విహారయాత్ర.. స్నేహితుడి దగ్గర అడిగి తీసుకున్న కారు.. ఒక రోజు వ్యవధిలో లభించిన రెండు మృతదేహాలు – ఒకటి గుర్తుపట్టలేనంతగా కాలిపోతే, మరొకటి రైలు పట్టాలపై ముక్కలై ఉంది.
ఒక రహస్య ప్రేమాయణం బెంగళూరులో ఈ వారంలో అత్యంత భయంకరమైన నేరంగా ముగిసింది. దేనవహళ్లి తాలూకా కార్యాలయంలో ప్రభుత్వ క్లర్కుగా పనిచేస్తున్న సి. రామజినప్ప (45), ఒక ప్రైవేట్ కళాశాలలో కన్నడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సరోజ జె (40) మధ్య ఉన్న ఈ సంబంధం ప్రమాదకరమైన మలుపు తీసుకుంది.
ఆ రోజు ఏం జరిగింది?
విడాకులు తీసుకున్న రామజినప్ప తన సంబంధాన్ని చాలా రహస్యంగా ఉంచాడు. గత శనివారం, ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ అని అబద్ధం చెప్పి తన స్నేహితుడి కారును అడిగి తీసుకున్నాడు. ఉదయం 9:30 గంటలకు దేవనహళ్లి బస్ స్టాప్ వద్ద సరోజను పికప్ చేసుకుని నంది హిల్స్‌కు వెళ్లారు. మధ్యాహ్నానికి దొడ్డబల్లాపూర్ సమీపంలోని జింకెబచ్చహళ్లి అనే నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే అంతా తలకిందులైంది.
కారు లోపల ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. కారు లోపల ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. రామజినప్ప సుత్తితో సరోజ తలపై బలంగా కొట్టాడని, ఆమె స్పృహ కోల్పోగానే వెనుక సీటులోకి మార్చి, కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడని అనుమానిస్తున్నారు. అయితే, కారు తగలబెట్టే క్రమంలో రామజినప్ప బట్టలకు కూడా నిప్పు అంటుకుంది. దీంతో ఆయన గాయాలతో అక్కడి నుండి పరారయ్యాడు.
కేసును పోలీసులు ఎలా ఛేదించారు?
కారులోని ఆధునిక సాంకేతికతే పోలీసులకు క్లూ ఇచ్చింది. ఆ కారుకు ‘ఆటో కొలిజన్ నోటిఫికేషన్ సిస్టమ్’ ఉంది. కారు ప్రమాదానికి గురైనట్లు యజమాని సురేష్ కుమార్ ఫోన్‌కు అలర్ట్ వెళ్ళింది. ఆయన రామజినప్పకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తగలబడిన కారులో లభించిన నగలను సరోజ భర్త జయశంకర్ గుర్తించారు.
రామజినప్ప ఏమయ్యాడు?
ఆదివారం ఉదయం బెంగళూరు సౌత్‌లోని బిడది వద్ద రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం ముక్కలై కనిపించింది. పక్కనే ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అది రామజినప్ప అని పోలీసులు గుర్తించారు. ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తూ పడిపోయాడా అన్నది విచారణలో ఉంది.
సరోజ భర్త జయశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒక భయంకరమైన రహస్య సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.
