త్రిశూర్: బెంగళూరులో లైంగిక దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి, నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కేరళ మహిళ చికిత్స పొందుతూ మరణించారు. మృతురాలిని వాదనపల్లికి చెందిన సునీత (47) గా గుర్తించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆమె కన్నుమూశారు.
ఈ నెల (మే) 3వ తేదీన సునీతపై ఈ దాడి జరిగింది. నిందితుడు కేరళకు చెందిన దీపక్ కృష్ణన్ అని గుర్తించారు. దీపక్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, సునీత గట్టిగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అసలేం జరిగింది?
కుక్కల సంరక్షణ (Dog Care) కోసం సునీత బెంగళూరుకు వెళ్లారు. ఆమెకు తన స్వగ్రామంలో కూడా కుక్కలను చూసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు దీపక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తన కుక్కలను సంరక్షించడానికి బెంగళూరు రావాలని దీపక్ ఆమెను కోరాడు.
బెంగళూరు చేరుకున్న సునీతపై దీపక్ వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె లొంగకపోవడంతో, ఆమె తలను గోడకు కేసి బలంగా కొట్టినట్లు సునీత భర్త త్రిశూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
