బెంగళూరు: లండన్‌లోని హీత్రో నుండి బెంగళూరు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో తీవ్ర సాంకేతిక లోపానికి గురైంది. ఒకవేళ పైలట్లు దీనిని గమనించకుండా విమానాన్ని టేకాఫ్ చేసి ఉంటే, భారీ ప్రమాదం సంభవించి ఉండేది.
అసలేం జరిగింది? లండన్ హీత్రో నుండి వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI 132) ఈరోజు సాయంత్రం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అయితే, విమానం తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతూ ఇంజిన్‌ను స్టార్ట్ చేసే క్రమంలో, ఎడమ వైపు ఉన్న ఫ్యూయల్ స్విచ్ (Fuel Switch) ‘Run’ పొజిషన్లో ఉండకుండా, రెండుసార్లు తనంతట తానుగా ‘Cutoff’ పొజిషన్‌కు మారిపోయింది.
విమానం నడిచేటప్పుడు ఈ స్విచ్ ‘Run’ స్థితిలో ఉంటేనే ఇంజిన్‌కు ఇంధనం అందుతుంది. అది ‘Cutoff’ కు మారితే ఇంధన సరఫరా ఆగిపోయి ఇంజిన్ ఆగిపోతుంది. ఈ తేడాను గమనించిన పైలట్ వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడంతో, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని నిలిపివేసి తనిఖీలకు పంపారు.
గత ఏడాది ప్రమాదంతో పోలిక: ఈ సాంకేతిక లోపాన్ని ఇంత సీరియస్‌గా చూడటానికి కారణం గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదమే. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI 171) టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విమాన ప్రమాద దర్యాప్తులో కూడా విమానం గాలిలోకి లేవగానే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్‌లు వాటంతట అవే ‘Cutoff’ కు మారినట్లు గుర్తించారు.
బ్లాక్ బాక్స్ వివరాలు: అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్‌ను పరిశీలించగా, కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ రికార్డ్ అయ్యింది. “స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు?” అని ఒక పైలట్ అడగ్గా, “నేను చేయలేదు” అని మరో పైలట్ సమాధానం ఇచ్చారు. ఇది పైలట్ల తప్పిదమా లేక యంత్ర లోపమా అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది.
ప్రయాణీకుల ఆందోళన: సాధారణంగా ఈ ఫ్యూయల్ స్విచ్‌లు లాక్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. వాటిని పైకి ఎత్తితే తప్ప పొజిషన్ మార్చడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఘటనలో ఆ లాక్ సిస్టమ్‌ను దాటుకుని స్విచ్ ఆటోమేటిక్‌గా మారిపోవడం భద్రతపై ఆందోళనలు పెంచుతోంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అన్ని విమానాలను తనిఖీ చేసినా ఏ లోపం లేదని చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే సమస్య బయటపడటం గమనార్హం.
