ముస్సోరి: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలోని ఒక హోటల్ గదిలో 27 ఏళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బి. రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఆమె ముక్కు నుండి రక్తం కారినట్లుగా ఉండటమే కాకుండా, బెడ్షీట్లు, దుప్పట్లపై రక్తపు మరకలు ఉన్న స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఆమె బస చేసిన గది నుండి ఒక ఖాళీ మద్యం సీసాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాధా గాయత్రి తన భర్త సౌమ్య శ్రీచరన్తో కలిసి ముస్సోరికి టూర్ వచ్చిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరికీ వివాహమై కేవలం 8 నెలలు మాత్రమే కావడం గమనార్హం. ఉదయం తాను నిద్రలేచి చూసేసరికి తన భార్య స్పృహలేకుండా పడి ఉందని, ఎంత పిలిచినా పలకకపోవడంతో లబోదిబోమంటూ భర్త పోలీసులకు సమాచారం అందించాడు.
తీవ్ర దర్యాప్తులో పోలీసులు:
మరణించిన రాధా గాయత్రి మరియు ఆమె భర్త ఇద్దరూ సమాచార సాంకేతిక (IT) రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. భార్య గురుగ్రామ్ (గుర్గావ్) లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో, భర్త పూణేలోని మరో సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, సెలవుల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. అయితే ఈమె మరణం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply