బరేలీకి చెందిన ఒక సామాన్య, అమాయక యువకుడి మొబైల్‌కు వచ్చిన గుర్తుతెలియని కాల్ అతని జీవితాన్నే తలకిందులు చేసింది.
అవతలి వైపు నుంచి మాట్లాడిన యువతి, తాను పొరపాటున వేరే నంబర్‌కు డయల్ చేశానని చెబుతూ మాటలు కలిపింది. ఆమె మృదువైన స్వరం ఆ యువకుడి మనసును ఇట్టే ఆకర్షించింది. ఆ రాంగ్ కాల్ క్రమంగా పరిచయానికి దారితీసి, ఇద్దరి మధ్య స్నేహంగా మారి, చివరకు ప్రేమగా చిగురించింది.
ప్రేమ ముదిరిన తర్వాత ఆ యువతి తన కోరిక మేరకు వీడియో కాల్స్ చేయడం ప్రారంభించింది. ఆమె మాయమాటలకు బుట్టలో పడిన ఆ యువకుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కాల్స్ మాట్లాడేవాడు. ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడంతో పాటు స్క్రీన్ మీదే ముద్దులు కూడా పెట్టుకునేవారు. ఆ మైకంలో యువకుడు చొక్కా లేకుండా అర్ధనగ్నంగా కూడా కనిపించాడు; కానీ అదే తనకు కొరివితో తల గోక్కున్నట్లు అవుతుందని అతను ఊహించలేకపోయాడు.
చివరకు ఆ వ్యక్తిగత క్షణాలు, వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ కిలాడీ లేడీ తన అసలు రంగు బయటపెట్టింది. ఆ యువకుడిని బ్లాక్మెయిల్ చేసి అతని వద్ద నుంచి ఏకంగా 4 లక్షల రూపాయలు గుంజేసింది. బయటకు ఎంతో అమాయకంగా, ప్రేమగా నటిస్తూ వచ్చిన ఆ యువతి నిజానికి ఒక ఘరానా మోసగత్తె అనే నిజాన్ని.. తన డబ్బూ, మనశ్శాంతీ రెండూ కోల్పోయిన తర్వాత గానీ ఆ యువకుడు గ్రహించలేకపోయాడు.

Leave a Reply