బ్రేకింగ్: వినియోగదారులకు షాకింగ్ న్యూస్..! భారీగా పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్ ధరలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం..!

రాబోయే పండుగ సీజన్‌లో ఏసీ, టీవీ, ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అది మీ జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉంది.

రాగి, ఉక్కు (స్టీల్), అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఛార్జీల పెంపు, రూపాయి విలువలో హెచ్చుతగ్గుల కారణంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, నౌకా రవాణాలో జాప్యం, 2.5 రెట్లు పెరిగిన సరుకు రవాణా ఛార్జీలు ఉత్పత్తి వ్యయాన్ని భారీగా పెంచేశాయి. అంతేకాకుండా, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ప్లాస్టిక్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో, అక్టోబర్ 1, 2026 నుండి ఏసీలు, ఇతర గృహోపకరణాల ధరలను 5% నుండి 8% వరకు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. 2026 సంవత్సరంలో ధరలు పెంచడం ఇది మూడోసారి.

దీని ప్రకారం ఏయే వస్తువుల ధరలు ఎంతమేర పెరుగుతాయో చూద్దాం:

  • ఏసీ (AC): గరిష్టంగా 5% నుండి 8% వరకు ధర పెరగనుంది. బ్లూ స్టార్, గోద్రెజ్, హయర్ (Haier), డైకిన్ వంటి ప్రముఖ బ్రాండ్లు 10% వరకు ధరలు పెంచాలని యోచిస్తున్నాయి.
  • ఎల్ఈడీ టీవీ & వాషింగ్ మెషీన్: 3% నుండి 4% వరకు ధర పెరిగే అవకాశం ఉంది. థామ్సన్, కొడాక్ బ్రాండ్లను తయారు చేసే SPPL సంస్థ, అక్టోబర్ తర్వాత టీవీల ధరలను 7% పెంచనుంది.
  • ఫ్రిజ్ & డీప్ ఫ్రీజర్: వీటి ధరలు 3% నుండి 5% వరకు పెరగనున్నాయి.

పండుగ సీజన్ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే వ్యాపారుల వద్ద పాత ధరల వస్తువులు భారీగా నిల్వ (స్టాక్) ఉన్నాయి. ఈ స్టాక్ సుమారు ఒకటిన్నర నెలల వరకు సరిపోతుంది కాబట్టి, రాబోయే దీపావళి వరకు వినియోగదారులకు పాత ధరలకే వస్తువులు లభించే అవకాశం ఉంది. కానీ, దీపావళి తర్వాత కొత్త ధరల పెంపు ప్రభావం నేరుగా కనిపిస్తుంది.

సాధారణంగా దసరా, దీపావళి పండుగ సీజన్లలోనే ఈ రంగం మొత్తం వార్షిక అమ్మకాల్లో 30% నుండి 40% వరకు జరుగుతాయి. ప్రీమియం రకం వస్తువులకు ఆదరణ ఎక్కువగా ఉన్న తరుణంలో, ఈ ధరల పెంపు వినియోగదారుల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *