ఒడిశా రాష్ట్రం కరంజియా సమీపంలోని మిలు గ్రామానికి చెందిన మాల్టే సోరెన్ – లిలీ సోరెన్ దంపతులు, ప్రతిరోజూ లాగే అడవికి ఆకులు సేకరించడానికి వెళ్లారు.
వారు దట్టమైన అటవీ ప్రాంతంలో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఆరు ఎలుగుబంట్ల గుంపు వారిని చుట్టుముట్టింది. అందులో ఒక ఉగ్రమైన ఎలుగుబంటి మెరుపు వేగంతో మాల్టే సోరెన్‌పై దాడి చేసి గాయపరిచింది. తన కళ్ల ముందే భర్తను ఎలుగుబంటి చీల్చివేస్తుండటం చూసిన భార్య లిలీ, భయపడి పారిపోకుండా ‘కాళికా దేవి’లా మారింది.
తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆ ఎలుగుబంటిపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించింది. ఒక మహిళ నుండి ఇటువంటి భయంకరమైన దాడిని ఏమాత్రం ఊహించని ఎలుగుబంట్లు హడలెత్తిపోయి అడవిలోకి పారిపోయాయి.
తీవ్రంగా గాయపడిన భర్తను రక్షించిన లిలీ సోరెన్, అతడిని ఆసుపత్రిలో చేర్పించింది. ఏనుగుల దాడుల తర్వాత ఇప్పుడు ఎలుగుబంట్ల గుంపులు గ్రామాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండటంతో ఒడిశా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
