భర్తకు తెలియకుండా ఇల్లంతా దాచిపెట్టిన నగదు 9 ఏళ్ల తర్వాత బయటపడింది. అయితే, తీరా అవి చేతికి వచ్చాక ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. కారణం.. అవి ఇప్పుడు చెల్లని పాత 500, 1000 రూపాయల నోట్లు కావడమే!
సాధారణంగా పెళ్లయిన మహిళలు భర్తలకు తెలియకుండా ఇంట్లో చిన్న చిన్న మొత్తాలను దాచుకోవడం అలవాటు. ఇంటికి కావాల్సిన అత్యవసర వస్తువులు కొనడానికో, పిల్లలు అడిగినవి కొనివ్వడానికో ఈ పొదుపును వాడుతుంటారు. ముఖ్యంగా మన తల్లులు వంటగదిలోని పోపుల డబ్బాలోనో, బీరువాలోనో భర్తకు తెలియకుండా చిల్లర, నోట్లు దాచడం మనం చూస్తుంటాం. ప్రతి చిన్న విషయానికి భర్తను డబ్బులు అడగకూడదనే ఉద్దేశంతో మహిళలు ఇలా చేస్తుంటారు.
9 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిధి
తాజాగా ఒక మహిళ తన భర్తకు తెలియకుండా ఇంట్లో అక్కడక్కడా 500 రూపాయల నోట్లను దాచిపెట్టింది. ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఏకంగా 9 ఏళ్ల తర్వాత ఆ డబ్బు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు మహిళ తన ముందు పడి ఉన్న పాత నోట్లను చూసి ఏడుస్తోంది.
ప్రధాని మోదీ నోట్ల రద్దు (Demonetization) సమయంలో రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్లు ఆమె వద్ద ఇప్పుడు దొరికాయి. కొన్ని 500 నోట్లు, ఒక 1000 రూపాయల నోటు అక్కడ ఉన్నాయి. ఆ నోట్లను చూపిస్తూ ఆమె కూతురు తన తల్లిని సరదాగా ఆటపట్టిస్తోంది. “మా నాన్నకు తెలియకుండా అమ్మ దాచిన డబ్బు 9 ఏళ్ల తర్వాత దొరికింది, కానీ ఇవి ఇప్పుడు చెల్లవు కదా అని అమ్మ బాధపడుతోంది” అని ఆ కూతురు వీడియోలో పేర్కొంది.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ నోట్లను ఆర్బీఐ (RBI) లో ఇస్తే కనీసం 50 శాతం సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంది, ఒకసారి ప్రయత్నించండి” అని కొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం “మహిళలు నిజంగా గిల్లాడీలు (తెలివైనవారు).. భర్తలకు తెలియకుండా డబ్బు దాచడంలో వారిని మించిన వారు ఉండరు” అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఇన్నేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ఆ మహిళను చూసి చాలామంది జాలిపడుతున్నారు.
