భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. శవాన్ని డ్రమ్ములో పెట్టి కాలువలో పడేసిన వైనం!

మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన అర్బాజ్ మక్సూద్ అలీఖాన్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం ఇంటి నుండి కనిపించకుండా పోయాడు.

అనేక చోట్ల వెతికినా అర్బాజ్ ఆచూకీ లభించకపోవడంతో అతని తండ్రి ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఖాన్ మొబైల్ ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేశారు.

అందులో ఖాన్ చివరి లొకేషన్ ముంబైలోని వెర్సోవా (Versova) ప్రాంతాన్ని చూపించింది. దీనితో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. ఖాన్‌తో చివరిగా ఫోన్‌లో మాట్లాడిన మెహజబీన్ అనే మహిళను అనుమానంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. మొదట్లో ఆమె దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ, పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె చెప్పిన నిజాలు విని పోలీసులే షాక్‌కు గురయ్యారు. తన భర్త హసన్, సోదరుడు తారిఖ్ షేక్‌లతో కలిసి.. అర్బాజ్ నుండి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ వేసి, ఆపై అతడిని హత్య చేసినట్లు మెహజబీన్ ఒప్పుకుంది.

ప్లాన్ ప్రకారం పిలిపించి.. దారుణ హత్య
డబ్బు విషయమై మాట్లాడాలని నమ్మించి, ఆ ముగ్గురు కలిసి ఖాన్‌ను వెర్సోవా ప్రాంతానికి రప్పించారు. అక్కడ ఖాన్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముఠా ప్లాస్టిక్ పైపులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు.. ఖాన్ మృతదేహాన్ని ఒక పచ్చటి రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో (Barrel) కుక్కి, జనసంచారం లేని ఒక ప్రాంతంలోని కాలువలో పడేసి అక్కడి నుండి పరారయ్యారు.

నిందితుల అరెస్ట్
ఈ ఘోర కలికానికి సంబంధించి ముంబ్రా పోలీసులు మెహజబీన్, ఆమె సోదరుడు తారిఖ్ షేక్‌లను అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త హసన్, అలాగే ఈ నేరానికి సహకరించిన ముజమ్మిల్ పఠాన్ అనే మరో వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.


Posted

in

by

Tags: