ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో సురేందర్ అనే వ్యక్తిని తన భార్య రూబీ హత్య చేసిన ఘటనలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధింపులు భరించలేక, ఈ హత్యకు చాలా రోజుల ముందే ప్లాన్ చేసినట్లు ఆమె పోలీసు విచారణలో వెల్లడించింది.
భర్త సురేందర్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు, కానీ కొద్ది రోజుల క్రితం ఆ ఉద్యోగం మానేశాడు. రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేయడం, భార్య సంపాదించిన డబ్బును మద్యం కోసం లాక్కోవడం, ఇవ్వకపోతే కొట్టడం చేసేవాడు. అంతేకాకుండా, కూతుళ్లను కూడా వేధించడం మొదలుపెట్టడంతో, ఈ సమస్యకు ముగింపు పలకాలని రూబీ నిర్ణయించుకుంది.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి హత్యకు ప్లాన్ వేసింది. పక్కనే జరుగుతున్న నిర్మాణ పనుల వద్ద నుంచి రూ.400కు వ్యర్థాలను (మల్బా) తెప్పించుకుంది. పారతో బాత్‌రూమ్ ఫ్లోర్‌ను తవ్వి, హత్య చేసిన భర్త మృతదేహాన్ని అందులో వేసి, అది త్వరగా కుళ్లిపోవడానికి ఇంట్లో ఉన్న ఉప్పును చల్లింది. ఆ తర్వాత వ్యర్థాలను నింపి, బాత్‌రూమ్ ఫ్లోర్‌ను చదును చేసింది. పక్కింటి వారి సహాయంతో ఒక కూలీని పిలిపించి, రూ.500 ఇచ్చి కేవలం గంటలోనే అక్కడ టైల్స్ వేయించేసింది.
మే 17 రాత్రి సురేందర్ మద్యం తాగి, మాంసం తిన్నాడు. రూబీ ముందుగానే సిద్ధం చేసుకున్న 20కి పైగా నిద్రమాత్రలను పౌడర్ చేసి ఖీర్‌లో కలిపింది. అది తిన్న భర్త గాఢ నిద్రలోకి వెళ్లాడు. తెల్లవారుజామున 3 గంటలకు భర్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న రూబీ, ఉదయం అత్తను, కూతుళ్లను తన బావ ఇంటికి పంపేసింది.
ఆ తర్వాత భర్త అదృశ్యమయ్యాడని కథ అల్లి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. హత్య జరిగి నెలన్నర రోజులు గడిచాక, ఒక పాత కేసు విషయంలో పోలీసులు సురేందర్ ఇంటికి విచారణకు వెళ్లడంతో రూబీ భయపడిపోయింది. భర్తను చంపి బాత్‌రూమ్‌లో పూడ్చిపెట్టిన విషయాన్ని బావ అనిల్‌కు చెప్పడంతో, అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాత్‌రూమ్ ఫ్లోర్‌ను తవ్వించి సురేందర్ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రూబీని అరెస్టు చేశారు.

Leave a Reply