అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ పాకిస్థాన్ క్షిపణి కార్యక్రమాన్ని అమెరికాకు పొంచి ఉన్న పెద్ద ముప్పుగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన పాకిస్థాన్, తమ క్షిపణులు కేవలం జాతీయ భద్రత కోసమేనని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా, ఈ విషయంలో పాకిస్థాన్ భారత్ పేరును లాగింది. భారత్ క్షిపణి సామర్థ్యాలే అసలైన ఆందోళనకర అంశమని వాదించింది. ‘జియో టీవీ’ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ వ్యూహాత్మక సామర్థ్యాలు పూర్తిగా రక్షణాత్మకమైనవని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, దక్షిణ ఆసియాలో శాంతిని నెలకొల్పడానికే వీటిని ఉద్దేశించామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ హుస్సేన్ అंद्राబీ పేర్కొన్నారు.
భారత్ వైపు వేలెత్తి చూపుతున్న పాక్: “భారత్ 12,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన క్షిపణులను అభివృద్ధి చేయడం ప్రాంతీయ భద్రతకు మించిన విషయం. ఇది ఖచ్చితంగా పొరుగు దేశాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆందోళన కలిగించే అంశం” అని అंद्राబీ వ్యాఖ్యానించారు. అమెరికాతో పరస్పర గౌరవం మరియు ఖచ్చితమైన వాస్తవాల ఆధారంగా చర్చలకు తాము సిద్ధమని ఆయన అన్నారు.
తులసీ గబ్బార్డ్ లేవనెత్తిన ప్రశ్నలు: 2026 వార్షిక ముప్పు అంచనా (Annual Threat Assessment) నివేదికను సెనేట్ కమిటీ ముందు ప్రవేశపెట్టిన తులసీ గబ్బార్డ్.. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌లతో పాటు పాకిస్థాన్‌ను కూడా అమెరికాకు ముప్పుగా పరిణమించే దేశాల జాబితాలో చేర్చారు. పాకిస్థాన్ అభివృద్ధి చేస్తున్న సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, ముఖ్యంగా ICBMలు (అంతర్‌ఖండ బాలిస్టిక్ క్షిపణులు), అమెరికా గడ్డపై దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆమె హెచ్చరించారు.
34 పేజీల ఈ నివేదికలో పాకిస్థాన్ క్షిపణి సాంకేతికతను విస్తరిస్తోందని, ఇది దక్షిణ ఆసియా సరిహద్దులను దాటి ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగలదని పేర్కొన్నారు. అలాగే అల్-ఖైదా, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ (IS) ఖురాసన్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు ఉన్న సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు నిరంతర ముప్పుగా ఉన్నాయని గబ్బార్డ్ స్పష్టం చేశారు.
