టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న పోరుకు రంగం సిద్ధమైంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టీమ్ ఇండియాకు సవాల్ విసురుతూ.. అభిషేక్ శర్మను ఆడించాలని కోరారు. దీనికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గట్టి బదులిస్తూ, అభిషేక్ రేపు ఆడతాడని స్పష్టం చేశారు.
సూర్యకుమార్ ఏమన్నారంటే: “పాక్ కెప్టెన్ సల్మాన్ కోరుకున్నట్లుగానే, రేపు అభిషేక్ శర్మ కచ్చితంగా ఆడతాడు. మేము ప్రతి మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాము. మా దృష్టి అంతా సన్నద్ధతపైనే ఉంది” అని సూర్య పేర్కొన్నారు. అలాగే టీమ్ ఇండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. “మొదట్లో మా బ్యాటింగ్ కొంచెం తడబడిన మాట వాస్తవమే, దీనికి సాకులు చెప్పలేము. పిచ్ కఠినంగా ఉన్నప్పుడు బ్యాటర్లు స్పష్టమైన ప్రణాళికతో ఉండాలి. టీ20 క్రికెట్లో మ్యాచ్ ఎప్పుడైనా మలుపు తిరగొచ్చు” అని వివరించారు.
టాస్ సమయంలో కరచాలనం (Handshake) చేస్తారా? టాస్ సమయంలో సల్మాన్ ఆఘాతో హ్యాండ్‌షేక్ చేస్తారా? అని ప్రశ్నించగా.. “అది టాస్ సమయంలోనే చూద్దాం, మరో 24 గంటలు వేచి చూడండి” అని చమత్కరించారు. కుల్దీప్ యాదవ్ గురించి అడగ్గా.. “మీరు అతను ఆడాలని కోరుకుంటే, సరే అతను ఆడతాడు” అని సరదాగా బదులిచ్చారు. ప్రత్యర్థి జట్టు కంటే మా ప్రదర్శనపైనే మాకు నమ్మకం ఉందని సూర్య ధీమా వ్యక్తం చేశారు.
జట్టులో మార్పులు: గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శామ్సన్ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిషేక్ తిరిగి రావడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది.
