రాజస్థాన్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించినట్లు భావిస్తున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది.
శ్రీగంగానగర్ జిల్లాలోని రావ్లా మండి ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (BSF), యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ANTF) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎత్తున అనుమానాస్పద పేలుడు పదార్థాలు పట్టుబడినట్లు సమాచారం అందింది. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
’12 KND’ సరిహద్దు ప్రాంతంలో గుర్తించిన అనుమానాస్పద పార్శిళ్లను తనిఖీ చేయగా.. రెండు పిస్టోళ్లు, నాలుగు మ్యాగజైన్లు, దాదాపు 650 లైవ్ రౌండ్ల తూటాలు, 7 కిలోల ఆర్డీఎక్స్ (RDX) గా అనుమానిస్తున్న పేలుడు పదార్థం పట్టుబడినట్లు కథనం పేర్కొంది. వీటితో పాటు నాలుగు జతల బ్యాటరీలు, రెండు రిమోట్ కంట్రోలర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలు, ఆ పేలుడు పదార్థం కచ్చితమైన స్వభావంపై రసాయన పరీక్షల అనంతరమే అధికారిక ధ్రువీకరణ వెలువడనుంది.
ANTF ఐజీ వికాస్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డ్రోన్ల సాయంతో సరిహద్దు అవతలి నుంచి ఈ పేలుడు పదార్థాలు, తూటాలను ఇక్కడికి జారవిడిచి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ భారీ సరుకును సరిహద్దు అవతలి నుంచి ఎవరు పంపించారు? ఇక్కడ ఎవరికి చేరవేయాల్సి ఉంది? దీని వెనుక ఏవైనా ఉగ్రవాద మూకలు ఉన్నాయా? అనే అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భారీ పరిమాణంలో ఆయుధాలు లభ్యం కావడంతో అధికారులు ఈ కుట్ర మూలాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
అరెస్టయిన ఇద్దరు నిందితులను భద్రతా బలగాలు తీవ్రంగా విచారిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఎక్కడికి తీసుకెళ్లాలని పథకం వేశారు? వీరి వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా, గస్తీని అధికారులు మరింత ముమ్మరం చేశారు.

Leave a Reply