భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు ఇక్కడి సంస్కృతి, ఆచారాలు మరియు ప్రజల ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. అయితే, ఒక బ్రిటిష్ పర్యాటకుడు మన దేశం నుండి తిరిగి వెళ్లేటప్పుడు వ్యక్తం చేసిన భావోద్వేగం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంది.
ఏం జరిగిందంటే? @flewy86 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో, ఆ పర్యాటకుడు భారత్‌ను విడిచిపెట్టి బ్రిటన్ వెళ్లడం తనకెంతో కష్టమని చెప్తున్నాడు. “నిజం చెప్పాలంటే, భారతదేశంలో నా స్నేహితులకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్లడం ప్రపంచంలోనే నాకు అతి పెద్ద బాధ. ప్రతిసారీ భారత్ వదిలి వెళ్లేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ప్రపంచంలో భారత్ లాంటి మరో చోటు లేదు. నాకు ఈ దేశం మరెక్కడి కంటే ఎక్కువగా ఇష్టం,” అని అతను కన్నీటి పర్యంతమయ్యాడు. చివరగా ‘జై హింద్’ అంటూ తన సందేశాన్ని ముగించాడు.
నెటిజన్ల స్పందన: ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “చింతించకు, నీ ఆత్మలో ఒక భాగం ఎప్పటికీ భారత్‌లోనే ఉంటుంది, నువ్వు తప్పక తిరిగి వస్తావు” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొకరు, “ఈ వీడియో చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. విదేశీయుడికి భారతదేశంపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చూసి భారతీయులందరూ గర్వపడుతున్నారు.
