ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్ఓ (CFO) శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ ఈ-కామర్స్ దిగ్గజం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన వైదొలిగిన తర్వాత, తాత్కాలికంగా ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ రవి అయ్యర్ గ్రూప్ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలో ఐపీఓ (IPO)కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దశాబ్ద కాలానికి పైగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధం ఉన్న వెంకటరామన్, రాబోయే కొన్ని నెలల్లో కంపెనీ నుండి నిష్క్రమిస్తారు. ఆయన వారసుడిని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
“బాధ్యతల బదిలీ సజావుగా సాగేందుకు శ్రీరామ్ మరికొంత కాలం కంపెనీలో కొనసాగుతారు. ఈ సమయంలో ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ రవి అయ్యర్ గ్రూప్ ఆర్థిక విభాగాన్ని పర్యవేక్షిస్తారు,” అని కంపెనీ పేర్కొంది. అలాగే, నిశాంత్ వర్మన్‌ను సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఆయన కార్పొరేట్ డెవలప్మెంట్ మరియు పార్టనర్‌షిప్‌లను చూసుకుంటారు.
ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ (IPO) వివరాలు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వచ్చే నెలలోనే ఐపీఓ ప్రక్రియ కోసం బ్యాంకర్లను సంప్రదించే పనిని ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించనుంది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయ్యే విషయమై కంపెనీ ఇప్పటికే పెట్టుబడిదారులు మరియు బ్యాంకర్లతో అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఐపీఓ ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఉండవచ్చు.
ఉద్యోగుల తొలగింపు (Layoffs)
గ్రూప్ సీఎఫ్ఓ నిష్క్రమణకు ముందే, పనితీరు సమీక్ష ఆధారంగా ఈ ఏడాది సుమారు 400-500 మంది ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ తొలగించింది. ఇది మొత్తం సిబ్బందిలో 3-4% వరకు ఉంటుంది. సాధారణంగా ప్రతిఏటా 1-2% మందిని తొలగించే కంపెనీ, ఈసారి ఆ సంఖ్యను పెంచడం గమనార్హం. కాగా, సీనియర్ లెవల్ నియామకాలపై కంపెనీ ప్రస్తుతం దృష్టి సారించింది.
డిసెంబర్ 2025లో, ఫ్లిప్‌కార్ట్ తన ప్రధాన కేంద్రాన్ని (legal domicile) సింగపూర్ నుండి భారతదేశానికి మార్చుకోవడానికి ఎన్.సి.ఎల్.టి (NCLT) నుండి అనుమతి పొందింది. దేశీయంగా ఐపీఓకి రావడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.
ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక పరిస్థితి
బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ ‘టోఫ్లర్’ (Tofler) డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ ఇండియా నష్టం ₹5,189 కోట్లకు పెరిగింది (గతేడాది ఇది ₹4,248.3 కోట్లు). అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3% పెరిగి ₹82,787.3 కోట్లకు చేరుకుంది. ఖర్చులు కూడా అదే స్థాయిలో 17.4% పెరిగి ₹88,121.4 కోట్లుగా నమోదయ్యాయి.
