‘భారీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉండండి, దీని వెనుకున్న కుట్ర మాకు తెలుసు’; జైరాం రమేష్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం

రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ జైరాం రమేష్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా మందలించింది. “దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. దీని వెనుకున్న కుట్ర మాకు తెలుసు” అని సిజెఐ వ్యాఖ్యానించారు. కోర్టు కఠిన వైఖరిని గమనించిన జైరాం రమేష్ వెంటనే తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

కేసు నేపథ్యం: పర్యావరణ అనుమతులు (Environmental Clearance – EC) లేకుండానే ప్రారంభమైన ప్రాజెక్టులకు, పాత తేదీలతో అనుమతులు (Ex-post facto EC) మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ జైరాం రమేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 12, గురువారం నాడు దీనిపై విచారణ జరిగింది.

సిజెఐ అడిగిన కఠిన ప్రశ్నలు: సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం జైరాం రమేష్‌ను ఇలా ప్రశ్నించింది:

  • “వనశక్తి రివ్యూ జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు ఇప్పటికే ‘ఎక్స్-పోస్ట్ ఫాక్టో EC’ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించినప్పుడు, మళ్లీ రిట్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు?”
  • “ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఉండి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేంద్రం జారీ చేసిన మెమోరాండమ్‌ను ఎలా సవాలు చేస్తారు?”

కోర్టు మందలింపు: పిటిషన్ కేవలం ప్రచారం కోసమేనని అభిప్రాయపడుతూ, “ఇది మీడియా కోసం చేస్తున్నట్లుంది. ఒకవేళ ఇది తప్పు అని తేలితే భారీ జరిమానా విధిస్తాం” అని కోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు జరిమానా విధిస్తుందని భయపడి, కాంగ్రెస్ ఎంపీ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.


Posted

in

by

Tags: