కడప జిల్లా నందలూరులో రైల్వే ఇంజిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. శ్రీనివాసులు మొదటి భార్య 10 ఏళ్ల క్రితం చనిపోగా, 2016లో కృష్ణవేణి (30) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వీరు రాజంపేటలోని పొయనపల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఘటనకు కారణం:
శ్రీనివాసులు మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత 6 నెలలుగా కృష్ణవేణి “ఆత్మహత్య చేసుకుంటాను” అని భర్తను బెదిరిస్తున్నట్లు సమాచారం. మొన్నటి రోజున కూడా దంపతుల మధ్య గొడవ జరగడంతో, కృష్ణవేణి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది.
కళ్లముందే ప్రాణాలు పోతున్నా వీడియో:
కిటికీలోంచి భార్య చేస్తున్న ప్రయత్నాన్ని చూసిన శ్రీనివాసులు, ఏమాత్రం కనికరం లేకుండా.. “సరిగ్గా ఉరి వేసుకో, గట్టిగా తగిలించుకో” అని నవ్వుతూ తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. తన కళ్లముందే భార్య విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నా కాపాడటానికి ప్రయత్నించలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. వారు తలుపులు పగులగొట్టి కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు:
పోలీసులు శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా.. “ఆమె ఎప్పుడూ నన్ను బెదిరిస్తూనే ఉంటుంది, ఇప్పుడు కూడా నటిస్తుందని అనుకున్నాను” అని బుకాయించాడు. అయితే పోలీసులు అతడి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. భార్య ఉరి వేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసిన దృశ్యాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
