భార్య ముందే తండ్రి తిట్టాడని.. రోకలిబండతో తలలు పగలగొట్టి తల్లిదండ్రులను అంతం చేసిన కొడుకు

మహారాష్ట్ర : తండ్రీకొడుకుల బంధానికి మాయని మచ్చ తెచ్చే ఘోర ఘటన ధులేలో జరిగింది. తన భార్య ఎదుట తండ్రి అవమానకరంగా మాట్లాడాడనే కోపాన్ని మనసులో ఉంచుకుని, కన్న కొడుకే ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తలలపై రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంచలన ఘటన ధులే జిల్లాలోని శిరపూర్ నగరంలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అందిన సమాచారం ప్రకారం.. ధులేలోని శిరపూర్ నగరంలో ఈ ఘోరం జరిగింది. మృతులను గంగా మహతో (50), రంజూదేవి మహతో (43)గా గుర్తించారు. కన్న తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్న ఆ కర్కోటక కొడుకు పేరు చందన్‌కుమార్ గంగా మహతో. వీరు మూలతః బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాకు చెందినవారు. శిరపూర్ నగరంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న చందన్.. తన తల్లిదండ్రులు మరియు భార్యతో కలిసి శిరపూర్ నగరంలోని మహావీర్ సొసైటీలో నివసిస్తున్నాడు.

అసలేం జరిగింది?
శుక్రవారం మధ్యాహ్నం చందన్ తన స్నేహితులకు ఫోన్ చేసి, తన తల్లిదండ్రులు మెట్లపై నుండి జారిపడ్డారని, వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. అయితే, సహాయం చేయడానికి వచ్చిన పొరుగువారు తల్లిదండ్రుల తలపై ఉన్న గాయాలను చూసి చందన్‌పై అనుమానం వ్యక్తంచేశారు. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. శిరపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇల్లు మొత్తాన్ని పరిశీలించగా, చందనే తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు షాకింగ్ నిజం బయటపడింది.

మెట్లపై నుండి పడ్డారంటూ కట్టుకథ
చందన్‌కుమార్ తీవ్ర కోపంతో తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఉన్న రోకలిబండతో ఇద్దరి తలలపై బలంగా బాదాడు. ఈ దాడిలో తండ్రి గంగా మహతో, తల్లి రంజూదేవి మహతోలకు తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన చేతులతోనే తల్లిదండ్రులను చంపేసిన తర్వాత అతను తేరుకున్నాడు. ఈ విషయాన్ని దాచడానికి.. మొదట తల్లిదండ్రులు మెట్లపై నుండి కాలు జారి పడ్డారని, అందుకే తలలకు గాయాలయ్యాయని పోలీసుల ముందు కట్టుకథ అల్లాడు. అయితే అతని సమాధానాలపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి (పోలీస్ ఖాకీ చూపించగానే), అతను తన నేరాన్ని అంగీకరించాడు.

భార్య ముందే అవమానించారని…
తల్లిదండ్రులు ఎప్పుడూ తన భార్య ముందే తనను అవమానిస్తుండేవారని, ఈరోజు కూడా అలాగే భార్య ఎదుటే నానా మాటలు అన్నారని చందన్ పోలీసులకు తెలిపాడు. ఆ కోపంలోనే వారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో శిరపూర్ పోలీసులు చందన్‌కుమార్ మహతోను వెంటనే అరెస్ట్ చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి, పోలీసులు ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags: