భార్యతో బలవంతపు శారీరక సంబంధం పెట్టుకుంటే భర్తను శిక్షించవచ్చా.? సుప్రీంకోర్టు సంధించిన కీలక రాజ్యాంగపరమైన ప్రశ్నలు.!!

భారతీయ శిక్షాస్మృతి (IPC) అలాగే సరికొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల ప్రకారం.. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శారీరక సంబంధం పెట్టుకోవడం (మారిటల్ రేప్) నేరంగా పరిగణించబడని పరిస్థితుల్లో, అదే చర్యకు ఒక భర్తను భవిష్యత్తులో నేరస్థుడిగా పరిగణించి శిక్షించవచ్చా లేదా అనే అంశంపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1)ను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలను లేవనెత్తింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. వివాహ బంధంలో భర్త బలవంతపు శారీరక సంబంధాల నుంచి మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం చట్టంలో భర్తలకు ఉన్న మినహాయింపును తక్షణమే రద్దు చేయాలని కోర్టును కోరారు. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఇది అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన సామాజిక-చట్టపరమైన అంశం కాబట్టి దీనిని పార్లమెంటు పరిశీలనకే వదిలివేయాలని కోర్టుకు విన్నవించారు.

ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తులు.. ప్రస్తుత చట్టంలో లోపాలు, సంక్లిష్టతలు ఉంటే పార్లమెంటు ఆమోదంతోనే దాన్ని పునర్నిర్వచించవచ్చని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.


Posted

in

by

Tags: