భార్య వివాహేతర సంబంధంపై అనుమానం రావడంతో రోబోట్ వాక్యూమ్ క్లీనర్ సాయంతో ఆధారాలు సేకరించిన తైవాన్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
2023లో తన హాలిడే హోమ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఉపయోగించిన టూత్ బ్రష్‌ను ఆయన గమనించినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ఆయన, అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఒక అపరిచిత వ్యక్తి తన భార్యను ఇంట్లో దింపి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో భార్య కదలికలపై మరింత దృష్టి సారించిన ఆయన, టెక్నాలజీ సాయంతో ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఇంట్లో ఉన్న రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను మొబైల్ ఫోన్ ద్వారా రిమోట్‌గా ఆపరేట్ చేశారు. ఆ పరికరంలో అమర్చిన కెమెరా ద్వారా ఇంట్లో జరిగిన వ్యక్తిగత దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియోను ఆయన కోర్టులో సాక్ష్యంగా సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీని ప్రకారం ఆయనకు సుమారు రూ.15 లక్షల నష్టపరిహారం అందింది. దీంతో కేసులో భర్త విజయం సాధించినట్లే కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
భర్త రోబోట్ పరికరం ద్వారా తన వ్యక్తిగత గోప్యతను, ఏకాంత క్షణాలను అనుమతి లేకుండా రికార్డ్ చేశాడంటూ భార్య ప్రత్యేకంగా ఫిర్యాదు చేసింది. ఒకరి వ్యక్తిగత విషయాలను వారి అనుమతి లేకుండా రికార్డ్ చేయడం తైవాన్ చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తారు. వివాహ బంధంలో ఉన్నంత మాత్రాన ఇలాంటి రికార్డింగ్‌లకు చట్టపరమైన అనుమతి లభించదని కోర్టు స్పష్టం చేసింది. భార్య వ్యక్తిగత గోప్యతను (ప్రైవసీని) ఉల్లంఘించినట్లు వచ్చిన అభియోగాన్ని విచారించిన న్యాయస్థానం, భర్త తరఫు వాదనలను తిరస్కరించింది. ఫలితంగా ఆయన మొదట సాధించిన విజయమే ఆయనకు పెద్ద చిక్కుగా మారింది.
చివరకు, అనుమతి లేకుండా వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసిన నేరానికి గాను ఆ వ్యక్తికి 5 నెలల జైలు శిక్ష పడింది. దీనితో పాటు సుమారు రూ.4.5 లక్షల జరిమానా కూడా విధించారు. భార్య ప్రవర్తనపై సాక్ష్యాలు సేకరించేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానమే చివరకు ఆయనను చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకరి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి ఆధారాలు సేకరించడం చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. స్మార్ట్ పరికరాలను ఉపయోగించేటప్పుడు ప్రైవసీ నిబంధనలు, చట్టాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ కేసు గుర్తుచేస్తోంది.

Leave a Reply