అమెరికా భూతల యుద్ధానికి (Ground War) సిద్ధమవుతోందన్న నివేదికల నడుమ, 10 లక్షల మందికి పైగా సైనికులను యుద్ధానికి సిద్ధం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఎన్నడూ మర్చిపోలేని విధంగా భారీ నష్టాన్ని కలిగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
హార్ముజ్ సంక్షోభం – ట్రంప్ వ్యూహం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ యంత్రాంగం రెండు మార్గాలను ఆలోచిస్తోంది:
- శాంతి చర్చల ద్వారా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం.
- భూతల యుద్ధం ద్వారా హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని ఇరాన్‌ను దెబ్బతీయడం.
చర్చల కోసం పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా చేసుకుని అమెరికా 15 ప్రతిపాదనలను ఇరాన్‌కు పంపింది. అయితే, ఇరాన్ వాటిని తిరస్కరించి తన సొంత డిమాండ్లను ముందుంచింది. ఈజిప్ట్, టర్కీ దేశాల ద్వారా కూడా ఇరాన్ చర్చలకు ప్రయత్నిస్తోంది. చర్చలకు అవకాశం కల్పించడానికే ట్రంప్ 10 రోజుల పాటు చమురు క్షేత్రాలపై దాడులను నిలిపివేశారని కొందరు భావిస్తుంటే.. భూతల యుద్ధానికి సిద్ధమవడానికే అమెరికా ఈ సమయాన్ని వాడుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది.
సైనిక మోహరింపు ట్రంప్ పబ్లిక్ గా చర్చల గురించి మాట్లాడుతున్నప్పటికీ, పశ్చిమాసియాకు అమెరికా సైనికుల రాక పెరుగుతూనే ఉంది. భూతల యుద్ధం కోసం మరో 7,000 మంది సైనికులను అమెరికా ఇక్కడ మోహరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 50,000 మంది అమెరికా సైనికులు, యుద్ధ విమాన వాహక నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్‌లోని ‘ఖార్గ్ ద్వీపాన్ని’ స్వాధీనం చేసుకుని అక్కడి చమురు సంపదను నియంత్రించడం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ ఆ ద్వీపంలో మందుపాతరలను అమర్చి, సైన్యాన్ని మోహరించింది.
10 లక్షల మంది సైనికుల సన్నద్ధత శత్రువులను ఎదుర్కోవడానికి 10 లక్షల మంది సైనికులు మరియు వాలంటీర్లను సిద్ధం చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)లో చేరడానికి వేలాది మంది యువకులు దరఖాస్తు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహాన్షాహి మాట్లాడుతూ.. “సరిహద్దుల్లో శత్రువుల ప్రతి కదలికను మేము గమనిస్తున్నాం. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భూతల యుద్ధానికి వస్తే శత్రువు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.
