రోజూ మనం తినే ఆహారం మన శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే, భోజనం చేసిన తర్వాత మనం చేసే కొన్ని అలవాట్లు, శరీరం ఆ పోషకాలను సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ (డైజెస్టివ్ సిస్టమ్) పనితీరు కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే తినేటప్పుడు, తిన్న తర్వాత కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం.
ఆహారం తిన్న వెంటనే చాలామంది చేసే కొన్ని సాధారణ తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చూద్దాం:
తిన్న వెంటనే పడుకోవడం (అస్వస్థత):
భోజనం చేసిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ తిన్న వెంటనే మంచంపై పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో యాసిడ్స్ శాతమై, ‘యాసిడ్ రిఫ్లక్స్’ (అసిడిటీ), గుండెల్లో మంట (హార్ట్ బర్న్) మరియు కడుపులో అసౌకర్యం ఏర్పడతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నిటారుగా కూర్చోవడం లేదా కాసేపు వజ్రాసనం వేయడం మంచిది.
ఎక్కువగా నీళ్లు తాగడం:
కొంతమంది భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆహారం అరగడం చాలా కష్టమవుతుంది. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే జీర్ణ రసాలు (గ్యాస్ట్రిక్ జ్యూసెస్) నీళ్ల వల్ల పలచబడిపోతాయి, దీనితో జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. భోజనం చేసేటప్పుడు గొంతు అడ్డం పడితే తప్ప, ఎక్కువ నీరు తాగకూడదు. తిన్న అరగంట లేదా గంట తర్వాతే నీళ్లు తాగాలి. రోజంతా ప్రతి గంటకు 200 నుండి 300 మిలీ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తీవ్రమైన వ్యాయామం :
శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి జిమ్‌కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం మంచిదే. కానీ, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం తన శక్తినంతటినీ జీర్ణవ్యవస్థ వైపు మళ్లించే సమయంలో.. భారీ వర్కౌట్లు లేదా తీవ్రమైన వ్యాయామాలు అస్సలు చేయకూడదు. అలా చేస్తే కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం మరియు తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆహారం తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని, తగినంత సమయం గడిచిన తర్వాతే వ్యాయామాలు చేయాలి. తిన్న తర్వాత కాసేపు నెమ్మదిగా నడవడం (వాకింగ్) మాత్రం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
టీ, కాఫీలు తాగడం:
భోజనం చేసిన వెంటనే వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలామందికి రోజువారీ అలవాటుగా ఉంటుంది. కానీ, ఈ అలవాటు వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే ‘ఐరన్’ (ఇనుము)ను శరీరం గ్రహించే సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. ఇది దీర్ఘకాలంలో శరీరంలో పోషకాహార లోపానికి (న్యూట్రిషన్ డెఫిషియెన్సీ) దారితీస్తుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట వరకు ఎలాంటి టీ, కాఫీ లేదా కెఫిన్ పానీయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.

Leave a Reply