భూతాలు, ప్రేతాత్మలు ఉన్నాయా లేదా అనేది ఎవరికీ తెలియదు. కొందరు తాము చూశామని చెబితే, మరికొందరు అదంతా మనసు భ్రమ అని కొట్టిపారేస్తారు. కానీ మంగళూరులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ హడలెత్తించింది.
మంగళూరులో దెయ్యం కలకలం: మంగళూరులోని మంజల్పడె సమీపంలో ఒక రహస్య ఆకృతి కనిపించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. అర్థరాత్రి పాండేశ్వరంలోని ఫోరం మాల్ నుండి వస్తున్న ఒక యువకుడికి, మంజల్పడె రోడ్డు పక్కన తెల్లటి బట్టలు ధరించి, పొడవైన వేళ్లతో ఉన్న ఒక వింత ఆకృతి కనిపించింది. అది చూసి ఆ యువకుడు భయంతో వణికిపోయి, స్కూటర్ మీద నుండి కింద పడిపోయాడు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో, ఆ దెయ్యం అతనిపై దాడి చేసిందని, ఒంటిపై వేళ్ల గుర్తులు పడ్డాయని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.
భయంకరమైన ఆడియో: ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ దెయ్యం భయంతో ఆ రోడ్డుపై ప్రయాణించడానికే అందరూ జంకే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు, అదే సమయంలో ఆ యువకుడి ఫోన్‌కు ఒక భయంకరమైన ఆడియో సందేశం వచ్చింది. తుళు భాషలో ఉన్న ఆ ఆడియోలో.. “ఒరేయ్, ఆ వైపు వెళ్లొద్దు.. అక్కడ తెల్లటి ఆకృతి తిరుగుతోంది, ఎవరో దెబ్బలు తిన్నారు” అని ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆందోళన మరింత పెరిగింది.
అసలు జరిగిందేమిటి? నిజంగానే అక్కడ దెయ్యం ఉందా అని ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. ఆ ఆడియో పంపిన వ్యక్తిని పట్టుకోగా అసలు కథ తెలిసింది. ఆ యువకుడు ప్రతిరోజూ అర్థరాత్రి వరకు బయట తిరుగుతూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వారు ఎంత చెప్పినా వినేవాడు కాదు. అందుకే అతని స్నేహితుడే ఈ ‘దెయ్యం ప్లాన్’ వేశాడు.
ఒక యాప్ ద్వారా తన గొంతును భయంకరంగా మార్చి ఆడియో పంపాడు. అలాగే రోడ్డు పక్కన ఒక వ్యక్తికి తెల్లటి డ్రెస్ వేయించి నిలబెట్టాడు. స్నేహితుడిని భయపెట్టి బుద్ధి చెప్పాలనుకున్న ఈ ప్లాన్ కాస్తా, ఊరంతా పాకి స్థానికులను బెంబేలెత్తించేలా చేసింది!
