మంత్రి మరియు మహిళా ఎస్పీ మధ్య హోరాహోరీ వాగ్వాదం. ‘ఏఎస్‌ఐని సస్పెండ్ చేయి’ అని అనిల్ విజ్ ఆదేశం.. నిరాకరించిన అధికారిణి; వీడియో చూడండి!

హర్యానా క్యాబినెట్ మంత్రి అనిల్ విజ్ తన దూకుడు స్వభావంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కైతల్‌లో జరిగిన జిల్లా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమావేశం (District Grievance Committee meeting) ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఒక ఫిర్యాదు విషయంలో మంత్రి విజ్ మరియు జిల్లా ఎస్పీ ఉపాసన మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే, మంత్రి బహిరంగంగానే ఆ మహిళా అధికారిణిని సమావేశం నుండి బయటకు వెళ్ళిపోవాలని (Get Out) ఆదేశించారు.

అసలేం జరిగింది? డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఒక ఫిర్యాదుతో ఈ వివాదం మొదలైంది. తిత్తరమ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి.. కురుక్షేత్రలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ (ASI) సందీప్ తన వద్ద భూమి పేరుతో డబ్బులు తీసుకుని, ఇప్పుడు పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదు వినగానే కోపోద్రిక్తుడైన మంత్రి అనిల్ విజ్.. అక్కడే ఉన్న కైతల్ ఎస్పీ ఉపాసనను సదరు ఏఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

చట్టబద్ధమైన నిబంధనలను వివరించిన ఎస్పీ: అయితే, ఎస్పీ ఉపాసన దీనిపై స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం నిందితుడైన ఏఎస్‌ఐ కురుక్షేత్ర జిల్లాలో పనిచేస్తున్నారని, కాబట్టి కైతల్ ఎస్పీగా తనకు అతడిని సస్పెండ్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. తాము కేవలం కురుక్షేత్ర ఎస్పీకి లేదా డీజీపీకి లేఖ మాత్రమే రాయగలమని చెప్పారు.

మంత్రి ఆగ్రహం: నిబంధనల గురించి ఎస్పీ చెప్పిన సమాధానం మంత్రికి నచ్చలేదు. “మీకు అధికారం లేనప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోండి” అంటూ ఆయన కఠినంగా మాట్లాడారు. ఎస్పీ కూడా తన వాదనకు కట్టుబడి ఉండటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చివరికి కైతల్ డీసీ అపరాజిత జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్పీ ఆ అధికారిపై చర్యల కోసం డీజీపీకి లేఖ రాస్తానని అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.

గతంలోనూ ఇలాగే.. అనిల్ విజ్ ఒక మహిళా ఐపీఎస్ అధికారితో గొడవపడటం ఇది మొదటిసారి కాదు. గతంలో ఫతేహాబాద్‌లో ఐపీఎస్ అధికారిణి సంగీతా కాలయాతో కూడా ఆయన ఇలాగే వాదించి ‘గెట్ అవుట్’ అన్నారు. ఆ తర్వాత ఆమె బదిలీ కూడా జరిగింది.


Posted

in

by

Tags: