మద్యం తాగడానికి నీళ్లు ఇవ్వలేదని.. తొమ్మిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన బంధువు!

మద్యం తాగడానికి నీళ్లు తీసుకురావడానికి నిరాకరించినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని ఒక బంధువు తుపాకీతో కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

యశ్ పాల్ అనే బాలుడు ఈ ఘటనలో మరణించాడు. నిందితుడైన ధనేష్ యాదవ్‌ను సహావర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక నామకరణ వేడుకలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాలుడి పొట్టలో కాల్చాడు. యశ్ పాల్ మామ అనుజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బంధువులు, గ్రామస్థులు వేడుక కోసం గుమిగూడిన సమయంలో ధనేష్ యాదవ్ ఆ బాలుడిని నీళ్లు తీసుకురావాలని కోరాడు. అయితే బాలుడు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన నిందితుడు, తన వద్ద ఉన్న తుపాకీతో బాలుడి పొట్టలోకి కాల్పులు జరిపాడు.

తీవ్రంగా గాయపడిన యశ్ పాల్‌ను మొదట కాస్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అలీఘడ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. యశ్ పాల్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ (SHO) గోవింద్ వల్లభ్ శర్మ తెలిపారు. ఘటన తర్వాత పరారైన నిందితుడిని ఖితౌలీ కాలువ వంతెన సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. నేరానికి ఉపయోగించిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.


Posted

in

by

Tags: