కారైక్కాల్ బస్టాండ్లో విపరీతమైన మద్యం మత్తులో తూలుతూ కిందపడిపోయిన ఓ వ్యక్తిని.. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి రక్షించి, స్నానం చేయించి సురక్షితంగా సాగనంపిన మానవతా సంఘటన చోటుచేసుకుంది.
కారైక్కాల్ బస్టాండ్ ప్రాంగణంలో పీకలదాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి, లేచి నిలబడే ఓపిక కూడా లేక తూలుతూ నేలపై కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రమైన మత్తు కారణంగా అతడు పదేపదే కిందపడిపోతుండటంతో, సమీపంలో ఉన్న స్థానికులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు చేదోడుగా నిలిచారు.
అనంతరం ఆ వ్యక్తిని జాగ్రత్తగా లేవనెత్తి సమీపంలోని వాష్రూమ్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు, స్థానికులు.. అతడిపై నీళ్లు పోసి స్నానం చేయించి మత్తు దిగేలా చేశారు.
మత్తు పూర్తిగా దిగిన తర్వాత అతడికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, హితవు పలికి అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు. మానవతా దృక్పథంతో పోలీసులూ, సాధారణ పౌరులూ కలిసి చేసిన ఈ మంచి పనికి స్థానికులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
