మధ్యవర్తిత్వం అంటూ బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. కొట్టాల్సిన చోట కొట్టిన ఇరాన్.. షెబాజ్ షరీఫ్ షాక్!

వాషింగ్టన్: అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన పాకిస్థాన్‌కు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు వెళ్తున్న ఒక సరుకు రవాణా నౌకను అనుమతించలేమని చెబుతూ హార్ముజ్ జలసంధి నుండి ఇరాన్ వెనక్కి పంపించేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇరాన్ – అమెరికా మధ్య శాంతిని నెలకొల్పడానికి తాను సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.

నౌకను వెనక్కి పంపిన ఇరాన్: హార్ముజ్ జలసంధిని తన నియంత్రణలో ఉంచుకున్న ఇరాన్, ముందస్తు అనుమతి ఉన్న నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. దీనివల్ల వేల సంఖ్యలో నౌకలు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రపంచ చమురు వ్యాపారంలో 20 శాతం వాటా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. నిన్న పాకిస్థాన్ వైపు వెళ్తున్న నౌకను ఇరాన్ అడ్డుకుంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నేవీ కమాండర్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కరాచీ వైపు వెళ్తున్న ‘SELEN’ అనే నౌకను వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించాం. భద్రతా అనుమతులు లేనందున హార్ముజ్ జలసంధిని దాటడానికి వీల్లేదని స్పష్టం చేశాం” అని తెలిపారు.

నిబంధనలు పాటించాల్సిందే: IRGC నేవీ చీఫ్ రియర్ అడ్మిరల్ అలీరెజా తంగ్‌సిరి మాట్లాడుతూ.. “చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, అవసరమైన అనుమతులు లేకపోవడం వల్ల ‘సెలెన్’ నౌకను వెనక్కి పంపాము. ఈ జలసంధి ద్వారా ఏ నౌక వెళ్లాలన్నా ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకోవడం తప్పనిసరి” అని అన్నారు. ఈ నౌక కరీబియన్ దీవులకు చెందిన ‘సెయింట్ కిట్స్ అండ్ నెవిస్’ దేశపు జెండాతో ప్రయాణిస్తోంది. ఇది పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి సరుకులను చేరవేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నౌక పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయినట్లు ట్రాకర్ డేటా చూపిస్తోంది.

పాక్ ప్రధాని ట్వీట్ – విఫలమైన ప్రయత్నం: అంతకుముందు పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. అమెరికా మరియు ఇరాన్ అంగీకరిస్తే చర్చలకు వేదికను ఏర్పాటు చేస్తాం” అని పేర్కొన్నారు.

అయితే, అమెరికా దీనిపై ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ఇరాన్ ఏకంగా పాకిస్థాన్‌కు రావాల్సిన నౌకనే అడ్డుకోవడంతో షెబాజ్ షరీఫ్‌కు గట్టి అవమానం జరిగినట్లయింది. మధ్యవర్తిత్వం చేస్తానంటూ స్వయంగా ముందుకు వచ్చిన పాకిస్థాన్‌కు ఇరాన్ నుండి ఆశించిన గౌరవం దక్కకపోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.


Posted

in

by

Tags: