కోల్‌కతా: 15 ఏళ్ల సుదీర్ఘ తృణమూల్ కాంగ్రెస్ పాలనకు అంతం పలికి బెంగాల్ ఇప్పుడు కాషాయమయమైంది. బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ చారిత్రక ఉత్థానంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఆర్జి కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్. పానిహతి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆమె, కేవలం అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఒక కొత్త గొంతుకగా నిలిచారు.
తృణమూల్ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌ను సుమారు 30,000 ఓట్ల తేడాతో రత్న దేబ్నాథ్ ఓడించారు. విజయం తర్వాత ఆమె భావోద్వేగంతో మాట్లాడుతూ.. “మా అమ్మాయికి దుర్గామాత అంటే చాలా ఇష్టం, ఆమే బెంగాల్లో కమల వికసించేలా చేసింది” అని పేర్కొన్నారు. తన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. పానిహతిని ‘ఘోష్ కుటుంబం’ పట్టు నుండి, తృణమూల్ ‘థ్రెట్ కల్చర్’ (బెదిరింపు సంస్కృతి) నుండి విముక్తి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ఆమె తెలిపారు.
ఎమ్మెల్యేగా రత్న దేబ్నాథ్ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా ఉంది. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అసెంబ్లీలో తన మొదటి పని ఆరోగ్య శాఖలోని అవినీతి మూలాలను వెలికితీయడమేనని చెప్పారు. సాక్షాత్తు మమతా బెనర్జీ మంత్రిగా ఉన్న శాఖకే ఆమె సవాలు విసిరారు. “ఏ అవినీతి వల్లనైతే నా కుమార్తె హత్యకు గురైందో, ఆ అవినీతి ఎంత లోతుగా ఉందో నేను వెలికితీసి తీరుతాను” అని ఆమె స్పష్టం చేశారు.
కుమార్తె మరణం తర్వాత తాను సాగించిన సుదీర్ఘ పోరాటంలో ఈ విజయాన్ని మొదటి అడుగుగా రత్న దేవి భావిస్తున్నారు. తృణమూల్ అధినేత్రిపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. తాను మమతా బెనర్జీ మరియు అభిషేక్ బెనర్జీలను జైల్లో చూడాలనుకుంటున్నానని అన్నారు. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని, ఆ పరిస్థితిని మార్చడమే తన పోరాట లక్ష్యమని తెలిపారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రత్న దేబ్నాథ్ విజయం మమతా బెనర్జీ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోని అవినీతిపై నేరుగా జరుగుతున్న యుద్ధానికి సంకేతం.
