దేశంలో ఎన్నికల వాగ్దానాలు మరియు ఉచిత పథకాల (Freebies) సంస్కృతి పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని ‘పాన్-ఇండియా సమస్య’గా అభివర్ణించిన కోర్టు, రాజకీయ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకోవాలని సూచించింది.
ఉచిత పథకాలు మరియు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) వల్ల ప్రజల్లో పని పట్ల ఆసక్తి తగ్గిపోతుందని, ఇది దేశ నిర్మాణానికి గొడ్డలిపెట్టు అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ మరియు జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు ఉచితంగా వస్తువులను పంపిణీ చేసే బదులు.. నాణ్యమైన పాఠశాలలు, ఆసుపత్రులు, శిక్షణ కేంద్రాలు మరియు ఉపాధి అవకాశాలను కల్పించే ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టాలని సూచించింది.
మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రభావం: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ యువతకు నెలకు రూ. 1,500 భృతి ఇస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రధానాంశాలు:
- వనరుల దుర్వినియోగం: ఏదైనా వస్తువును పూర్తిగా ఉచితం చేస్తే దాని వాడకంలో క్రమశిక్షణ ఉండదు. ఉదాహరణకు విద్యుత్ ఉచితం అయితే అవసరం లేకున్నా లైట్లు, పంపులు ఆన్ చేసి ఉంచుతారు. కనీసం ఉత్పత్తి ఖర్చునైనా వినియోగదారుల నుండి వసూలు చేయాలి.
- టాక్స్ పేయర్స్ సొమ్ము: ఉచిత పథకాలకు డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? అని కోర్టు ప్రశ్నించింది. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్మని, వారు దీనికి బదులుగా మెరుగైన రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలను కోరుకుంటారని పేర్కొంది.
- ఆర్థిక అస్థిరత: ఆదాయ లోటుతో ఉన్న రాష్ట్రాలు కూడా పోటీ పడి ఉచిత పథకాలు ప్రకటించడం వల్ల అభివృద్ధి పనులకు నిధులు మిగలడం లేదు. ఆదాయంలో ఎక్కువ భాగం జీతాలు మరియు ఉచితాలకే ఖర్చవుతోంది.
- పని పట్ల ఉదాసీనత: ఉచితంగా రేషన్, గ్యాస్, నగదు ఇస్తూ పోతే ప్రజల్లో పనిచేయాలనే ప్రేరణ తగ్గుతుందని ధర్మాసనం హెచ్చరించింది.
నేపథ్యం: తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ (TANGEDCO) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఉచిత విద్యుత్ పథకాల వల్ల విద్యుత్ రంగంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కోర్టు చర్చించింది. తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాలకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తోందో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
