మరణం తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్లిన వారికి ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలపై శతాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రీయంగా దీనికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, మరణించి తిరిగి వచ్చిన (Near Death Experience) వ్యక్తులు చెప్పే కథనాలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, 20 నిమిషాల పాటు మరణించి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నారు.
ఏం జరిగిందంటే? 60 ఏళ్ల స్కాట్ డ్రమ్మండ్ తన 28వ ఏట ఒక ప్రమాదానికి గురయ్యారు. వేలికి జరిగిన ఆపరేషన్ సమయంలో, ఆయనను వైద్యులు మరణించినట్లుగా ప్రకటించారు. కానీ, 20 నిమిషాల తర్వాత ఆయన అద్భుతంగా ప్రాణాలతో తిరిగి వచ్చారు. తన అనుభవాన్ని ఆయన ఇలా వివరిస్తున్నారు:
ఆపరేషన్ థియేటర్‌లో.. “ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, నా వేలికి కుట్లు వేయడం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నర్సు కంగారుగా బయటకు వెళ్తూ ‘నేను అతన్ని చంపేశాను’ అని అరుస్తూ వెళ్లడం నాకు వినిపించింది. అప్పటికి నేను చనిపోయానని నర్సు భావించింది” అని స్కాట్ తెలిపారు.
అద్భుతమైన లోకం: “ఆ తర్వాత నన్ను ఎవరూ చూడని ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అది పచ్చని గడ్డి మైదానం, రంగురంగుల పూలవనాలతో నిండి ఉంది. నేను వెనక్కి చూడకూడదని ఏదో అదృశ్య శక్తి ఆజ్ఞాపించినట్లు అనిపించింది. నా పక్కనే ఎవరూ కనిపించకపోయినా, ఎవరో ఉన్నట్లు నేను గ్రహించాను. అది భగవంతుడే అని నేను భావించాను.”
జీవితపు ‘రివ్యూ’ (Life Review): “అక్కడ నా జీవితంలోని ప్రతి సంఘటన, నేను చేసిన మంచి పనులు, చెడు పనులు అన్నీ వీడియోలా నా కళ్లముందు కదిలాయి. నా కర్మల ఆధారంగా నాకు తీర్పు వస్తున్నట్లు అనిపించింది. ఆ తర్వాత, మేఘాలపై నడవమని ఒక అదృశ్య శక్తి నాకు ఆదేశించింది. అప్పుడే మేఘాలతో చేసిన ఒక దృఢమైన చేయి నా ముందుకొచ్చి, ‘నీ సమయం ఇంకా పూర్తి కాలేదు, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి’ అని చెప్పింది. ఆ మరుక్షణమే నేను తిరిగి నా శరీరంలోకి వచ్చాను.”
తిరిగి రావడం ఇష్టం లేదు: “ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. నిజానికి అక్కడి నుండి నేను తిరిగి రావాలని అనుకోలేదు. కానీ, మళ్ళీ నేను ప్రాణాలతో బయటపడ్డానని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను” అని స్కాట్ తన అనుభవాలను ముగించారు.
