అహ్మదాబాద్‌లో ఒక ప్రభుత్వ మహిళా డాక్టర్‌కు తన అత్తమామల నుండి ఎదురైన వేధింపులు 21వ శతాబ్దపు సామాజిక విలువలపై ప్రశ్నార్థకాలను లేవనెత్తుతున్నాయి. సంతానం కోసం ఆమెను వేధించడమే కాకుండా, తన మరిదితో సంబంధం పెట్టుకోమని లేదా అతని వీర్యం ద్వారా గర్భం దాల్చమని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో రక్షకుడిగా ఉండాల్సిన మామ (పోలీస్ అధికారి) భక్షకుడిగా మారడం గమనార్హం.
వారసుడి కోసం అమానుషమైన డిమాండ్:
బాధిత మహిళా డాక్టర్‌కు 2023లో ఒక ప్రభుత్వ ఉద్యోగి తో వివాహం జరిగింది. ఏడాది గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో వైద్య పరీక్షలు చేయించగా, భర్తకు సంతాన సామర్థ్యం లేదని తేలింది. దీని కోసం మూడుసార్లు IVF (In Vitro Fertilization) ప్రక్రియ ప్రయత్నించినా అది విఫలమైంది. దీనితో అత్తమామలు మర్యాదలు మరిచి, మరిది వీర్యం (Sperm) ద్వారా తల్లి కావాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు.
పోలీస్ మామ బెదిరింపులు:
బాధిత మహిళ మామ గుజరాత్ పోలీసు విభాగంలో పీఎస్ఐ (PSI) గా పనిచేస్తున్నారు. మరిదితో సంబంధానికి ఆమె నిరాకరించడంతో, “నువ్వు పోలీసుల దగ్గరకు వెళ్లినా నన్ను ఏమీ చేయలేవు” అని ఆయన తన అధికారాన్ని చూపిస్తూ బెదిరించారు. అంతేకాకుండా, భర్త కూడా ఆమెపై అసహజ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.
థాయ్‌లాండ్ సీక్రెట్ ట్రిప్:
భర్త శిక్షణ నిమిత్తం సౌరాష్ట్ర వెళ్తున్నానని అబద్ధం చెప్పి థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్ళాడు. ఆమె ఆఫీసులో విచారించగా అతను 15 రోజుల సెలవులో ఉన్నట్లు తెలిసింది. ఈ అబద్ధాన్ని ప్రశ్నించినందుకు అత్తమామలు మరింత రెచ్చిపోయారు.
దాడి మరియు కేసు నమోదు:
మహిళా డాక్టర్ ఇంటికి వెళ్ళిన సమయంలో అత్త, మరిది మరియు ఇతర సభ్యులు ఆమెపై కర్రలతో, పిడిగుద్దులతో దాడి చేశారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు గెంటివేయడంతో ఆమె పొరుగువారి ఇంట్లో తలదాచుకుంది. చివరకు మహిళా హెల్ప్‌లైన్ ‘అభయం’ సాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అహ్మదాబాద్‌లోని వేజల్పూర్ పోలీస్ స్టేషన్లో భర్త, మామ, అత్త, మరిదిపై తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.
