భారతదేశంలో పట్టు చీరలకు మహిళల మధ్య ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే పట్టు ఉత్పత్తిలో పట్టు పురుగుల పెంపకం చాలా కీలకం. ఈ నేపథ్యంలో, ఐఐటీ ముంబైకి చెందిన సెంటర్ ఫర్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ ఫర్ రూరల్ ఏరియాస్ (CTARA) ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. అదేంటో మీకు తెలుసా?
అందమైన పట్టు వస్త్రాల వెనుక కోట్లాది పట్టు పురుగుల మరణం దాగి ఉంటుంది. ఇది చాలా మందిని బాధించే విషయం. సాధారణంగా పట్టు కావాలంటే, పురుగులు తమ చుట్టూ గూళ్లు కట్టుకున్న తర్వాత, ఆ గూళ్లను మరుగుతున్న నీటిలో వేసి పురుగులను చంపి పట్టు దారాలను వేరు చేస్తారు. అప్పుడే నాణ్యమైన పట్టు దారాలు లభిస్తాయి.
పట్టు పురుగులు
ఈ జీవహింసను పూర్తిగా అరికట్టేలా ఐఐటీ ముంబై శాస్త్రవేత్తలు గత 3 ఏళ్లుగా తీవ్రంగా పరిశోధనలు చేసి, పురుగులను చంపకుండానే పట్టు దారాన్ని తీసే పద్ధతిని విజయవంతంగా కనుగొన్నారు. ఈ సరికొత్త సాంకేతికతకు “జీవోదయ” అని పేరు పెట్టారు. కోల్ ఇండియా లిమిటెడ్ తన సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా ఈ ప్రాజెక్టుకు పూర్తి ఆర్థిక సహాయం అందించింది.
జీవోదయ ప్రాజెక్ట్ ప్రత్యేకత:
ఈ పద్ధతిలో పట్టు పురుగుల సహజ జీవనానికి ఎలాంటి ఆటంకం కలగదు. సాధారణంగా మల్బరీ ఆకులను తిని పెరిగే పురుగులు ఒక దశలో తమ చుట్టూ గుండ్రని గూళ్లను కట్టుకుంటాయి. కానీ ఈ కొత్త పద్ధతిలో పురుగులు గూళ్లు కట్టుకోకుండా, ఒక చదునైన ఉపరితలంపై పట్టు దారాలను వదిలేలా వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారట.
- దీనివల్ల పట్టు దారాలను సేకరించడానికి పురుగులను చంపాల్సిన అవసరం ఉండదు.
- పట్టు పురుగులు తమ పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని అందమైన పట్టు పురుగుల(సీతాకోకచిలుకలు)గా మారుతాయి.
ఐఐటీ ముంబై చారిత్రాత్మక విజయం:
పరిశోధన దశలో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు వినియోగంలోకి రానుంది. ఇది పట్టు రైతులకు ఒక వరం లాంటిదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా పట్టు ఉత్పత్తిని మరింత సులభంగా, విస్తృతంగా చేపట్టవచ్చు. దీనివల్ల గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా రైతులకు స్థిరమైన మరియు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.
అహింసా పట్టు:
పర్యావరణానికి మరియు జీవులకు హాని కలగని ఈ టెక్నాలజీ, వస్త్ర రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది. ఇకపై పట్టు చీరల అందం వెనుక పట్టు పురుగుల ప్రాణ త్యాగం ఉండదని ఐఐటీ ముంబై శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు.
