ఉజ్జయిని: మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని పరిధిలో గల కోయ్‌లా ఫాటక్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మధుర్ తివారీ అనే ఉద్యోగి.. తనతో పాటు పనిచేసే ఒక మహిళా సహోద్యోగితో కలిసి స్థానిక రెస్టారెంట్‌కు వచ్చారు. అదే సమయంలో అతని భార్య వందన, ఆమె సోదరి (మరదలు), మామగారు మరికొంతమందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు ఈ మొత్తం హైడ్రామాను తమ మొబైల్ కెమెరాల్లో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మధుర్ తివారీకి తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే తాము కొన్ని రోజులుగా వారిపై నిఘా ఉంచామని భార్య వందన, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ కలిపి చూడటంతోనే తమకు ఆగ్రహం కట్టలు తెంచుకుందని, అందుకే వివాదం జరిగిందని వారు పేర్కొన్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ మరియు పురుషుడిని తోసివేస్తూ, కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నడిరోడ్డుపై జరిగిన ఈ రచ్చను చూడటానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.
ఆ ఆరోపణల్లో నిజం లేదు: భర్త వివరణ మరోవైపు ఈ ఆరోపణలను భర్త మధుర్ తివారీ పూర్తిగా తోసిపుచ్చారు. సదరు మహిళతో తనకు కేవలం వృత్తిపరమైన (Professional) సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంలో భార్య తరపు వారి జోక్యం మితిమీరిపోవడం వల్లే తమ వైవాహిక బంధం దెబ్బతిందని ఆయన ఆరోపించారు. తమ ఇద్దరి మధ్య చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయని, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో తనపై దాడి చేసి, దుర్భాషలాడటమే కాకుండా.. అమాయకురాలైన తన తోటి ఉద్యోగిని కూడా లక్ష్యంగా చేసుకుని వేధించారని మధుర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నగలు, వాహనం మాయమయ్యాయంటూ ఫిర్యాదు: తన ఇంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, దీనిపై కూడా తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మధుర్ తివారీ పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో తన సహోద్యోగి వాహనం తాళాలు (కీస్) లాక్కున్నారని, ఆ తర్వాత ఆమె వాహనం కూడా కనిపించకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఘటన కుటుంబ వివాదం నుండి ఇప్పుడు పోలీస్ స్టేషన్, చట్టపరమైన కేసుల వైపు మళ్లుతోంది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే అసలు నిజాలు బయటకు రానున్నాయి.

Leave a Reply