ముంబై: ప్రపంచవ్యాప్తంగా సగటున చూస్తే, పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారు. ప్రపంచ సగటు ప్రకారం, మహిళలు తమ పురుష మిత్రులు లేదా సోదరుల కంటే సుమారు 5 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. మహిళల ఆయుర్దాయం పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేనప్పటికీ, శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన కారణాలను విశ్లేషించారు.
జీవనశైలి మరియు అలవాట్లు: వియత్నాం వంటి దేశాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుండగా, కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో దాదాపు సమానంగా ఉంటున్నారు. పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలుగా ధూమపానం మరియు మద్యం వంటి వ్యసనాలను శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, అనేక దేశాల్లో పురుషులు మహిళల కంటే ప్రమాదకరమైన పనులలో పాల్గొనడం, రహదారి ప్రమాదాలు మరియు ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం కూడా వారి తక్కువ ఆయుర్దాయానికి కారణమవుతున్నాయి.
ఆరోగ్యంపై అశ్రద్ధ: పురుషులు మహిళల కంటే పోషకాహారం తీసుకోవడంలో వెనుకబడి ఉంటారని, బయట దొరికే నాసిరకం ఆహార పదార్థాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు పురుషులు వైద్యులను సంప్రదించడంలో మహిళల కంటే ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తారు. తమకు ఏమీ కాదులే అనే అతి విశ్వాసం కూడా వారి ప్రాణాల మీదకు వస్తుంది.
జీవసంబంధమైన కారణాలు (Biological Factors): పురుషులు తమ జీవనశైలిని మార్చుకున్నా కూడా మహిళల కంటే తక్కువ కాలమే జీవిస్తారు. ఎందుకంటే, జీవసంబంధమైన (Biological) కోణంలో చూస్తే మహిళల శరీరం పురుషుల కంటే దృఢంగా ఉంటుంది. స్పెయిన్లోని వాలెన్సియా విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్ట్ ప్రొఫెసర్ కాన్సుఎలో బోరాస్ పరిశోధన ప్రకారం, మహిళల్లో ఉండే ‘ఈస్ట్రోజెన్’ (Estrogen) అనే లైంగిక హార్మోన్ అత్యంత కీలకం.
ఈ హార్మోన్ మహిళల శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈస్ట్రోజెన్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటమే కాకుండా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, తలనొప్పి మరియు ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
