నేటి ఆధునిక కాలంలో మహిళలు అటు ఆఫీస్ పనులు, ఇటు ఇంటి బాధ్యతలు రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో తీవ్ర అలసటకు గురవుతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం, ముఖ్యంగా వెన్నెముక తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు వైద్యులు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు.
కంప్యూటర్ల ముందు గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడం వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. తల, మెడను ముందుకు వంచి ఉంచే అలవాటు, సరైన భంగిమలో కూర్చోకపోవడం వెన్ను కండరాలను బలహీనపరుస్తాయి. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మళ్లీ వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లల ఆలనాపాలనా వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తుండటంతో, అలసిపోయిన కండరాలకు తగినంత విశ్రాంతి దొరకడం లేదు.
నేలపై వంగి పనిచేయడం, నడుమును మాత్రమే వంచి బరువైన వస్తువులను ఎత్తడం వంటి తప్పుడు పద్ధతులు తీవ్రమైన వెన్నునొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా, నేలమీద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు కేవలం నడుమును వంచకుండా మోకాళ్లను మడిచి కూర్చుని ఎత్తే పద్ధతిని పాటించాలి. ఆఫీసులో పనిచేసేటప్పుడు క్రమం తప్పకుండా స్వల్ప విరామాలు తీసుకుంటూ కొద్దిసేపు అటుఇటు నడవడం, భుజాలు తిప్పడం వంటి చిన్నపాటి కదలికలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఇంటి పనులను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది.
వెన్నునొప్పి వేధిస్తున్నప్పుడు వెంటనే తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడటం మానేసి, ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించి సరైన వ్యాయామాలు లేదా చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు మాత్రమే మహిళల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.
