దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి వెళ్తున్న ‘ఫ్లైదుబాయ్’ (Flydubai FZ1073) విమానం గాలిలో ఎగురుతుండగా, తోటి పైలట్ అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
విమానాన్ని కిందకు దించి కుప్పకూల్చేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి, భారత సంతతికి చెందిన చీఫ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్‌పై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచార్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఎమర్జెన్సీ సిగ్నల్ పంపి, కాక్‌పిట్ తలుపును తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని బంధించారు.
గాయపడినప్పటికీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేసి, 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచార్ సాహసానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను గౌరవించేందుకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విమానాశ్రయంలోని ఒక టెర్మినల్ రూమ్‌కు (Terminal Room) స్మిత్ మచార్ పేరు పెట్టనున్నట్లు ఇజ్రాయెల్ డిప్యూటీ మంత్రి అల్మోగ్ కోహెన్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశమైన వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రవేశపెడతామని, ఇజ్రాయెల్ ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్నారని తెలిపారు.
అలాగే, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందిస్తూ.. “తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా 170 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచార్‌ను చూసి భారతదేశం గర్విస్తోంది. ఇదే భారతదేశపు నిజమైన గుర్తింపు. భారత ప్రభుత్వం ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని భావోద్వేగంగా ప్రశంసించారు. ప్రస్తుతం సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ భారతీయ సాహసుడికి ప్రపంచం నలుమూలల నుండి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply