హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక అద్దెదారు, తన మహిళా సహోద్యోగిని తన ఫ్లాట్‌కు పిలిచినందుకు అపార్ట్మెంట్ సెక్రటరీ నుండి అధికారిక హెచ్చరిక నోటీసు అందుకున్నట్లు పేర్కొన్నాడు.
ఘటన వివరాలు: రెడిట్ (Reddit) వేదికగా సదరు వ్యక్తి తన ఆవేదనను పంచుకున్నాడు. గత నెలలో తన మహిళా సహోద్యోగిని టీ, స్నాక్స్ మరియు డిన్నర్ కోసం రెండుసార్లు ఇంటికి ఆహ్వానించానని, ఆ వెంటనే సెక్రటరీ నుండి లిఖితపూర్వక నోటీసు వచ్చిందని తెలిపాడు. ఇరుగుపొరుగు వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, పెద్ద శబ్దంతో సంగీతం కూడా వినలేదని, అయినా అపార్ట్మెంట్ నియమాలను ఉల్లంఘించానంటూ నోటీసు ఇవ్వడంపై అతను విస్మయం వ్యక్తం చేశాడు.
నోటీసులోని సారాంశం: “గత నెల రోజులుగా కొందరు అద్దెదారులు వారాంతాల్లో/పనిదినాల్లో మహిళా సహోద్యోగులను తమ ఫ్లాట్లకు అనుమతిస్తున్నారని మాకు ఫిర్యాదులు అందాయి. ఇది అపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పొరపాట్లను యజమానులు అంగీకరించరు. భవిష్యత్తులో ఇది పునరావృతమైతే వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయాల్సి ఉంటుంది” అని ఆ నోటీసులో పేర్కొన్నారు.
నెటిజన్ల స్పందన: ఈ పోస్ట్ ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. “అద్దె ఒప్పందంలో (Rental Agreement) ఇలాంటి నిబంధన లేనప్పుడు, మేజర్లైన అతిథులను రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం” అని ఒకరు వ్యాఖ్యానించగా, “సదరు నియమ నిబంధనల కాపీని చూపమని అడగండి, సొసైటీ నిబంధనలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అతిక్రమించలేవు” అని మరొకరు సూచించారు.
