చెన్నై/వృద్ధాచలం: పీఎంకే (PMK) వ్యవస్థాపకులు డాక్టర్ రామదాస్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయనను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చారనే వార్త తెలియగానే.. వృద్ధాచలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన కుమారుడు, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందుకున్న వెంటనే అన్బుమణి ఒక్కసారిగా నిలకడ కోల్పోయి, వేదికపైనే ఆవేశంతో ఊగిపోయారు.
వేదికపైనే ఆవేదన.. ఆవేశం!
ప్రచారంలో ఉండగా డాక్టర్ రామదాస్ ఆసుపత్రిలో చేరారనే వార్త అన్బుమణికి చేరింది. ఆ క్షణం ఆయన ముఖం మారిపోయింది. పక్కనే ఉన్న పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ.. “మా అయ్యా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు.. ఆయనకు గనుక ఏమైనా జరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను.. ఎవరినీ వదిలిపెట్టను!” అని అత్యంత ఆక్రోశంతో హెచ్చరించినట్లు సమాచారం. తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమతో పాటు, ప్రస్తుత రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన నోటి నుంచి వచ్చిన ఈ ‘వదిలిపెట్టను’ అనే హెచ్చరిక ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
వైద్యుల ప్రకటన.. అయినా తగ్గని ఉత్కంఠ!
ప్రస్తుతం డాక్టర్ రామదాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, అన్బుమణి రామదాస్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? రాజకీయ ప్రత్యర్థులనా లేక ప్రభుత్వ యంత్రాంగాన్నా? అనే చర్చ ఊపందుకుంది. ఈ వార్తతో పీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
తొందరపడొద్దు.. కార్యకర్తలకు పిలుపు!
డాక్టర్ రామదాస్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఆయన క్షేమంగా ఉన్నారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అయినప్పటికీ, అన్బుమణి రామదాస్ ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ ప్రియతమ నేత త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు.
