యెమెన్‌లో సౌదీ అరేబియా మద్దతు ఉన్న వర్గాలకు, ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలకు మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సౌదీ అరేబియాపై హౌతీలు క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్, టర్కీకి హౌతీ నేతలు హెచ్చరికలు జారీ చేసినట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగతా దేశాలపై జరిగిన దాడిగానూ పరిగణించేలా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాపై హౌతీల దాడులు కొనసాగుతుండటంతో.. అవసరమైతే ఈ రక్షణ ఒప్పందం అమల్లోకి రావచ్చని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గతంలో వెల్లడించారు.
ఇదే సమయంలో హౌతీ నాయకత్వం పాకిస్థాన్, టర్కీలకు స్పష్టమైన హెచ్చరిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియాకు మద్దతుగా యెమెన్‌లో సైనికంగా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించినట్లు సమాచారం.
యెమెన్‌లో జరుగుతున్న సంఘర్షణలో పాకిస్థాన్, టర్కీ నేరుగా సైనికంగా జోక్యం చేసుకోకుండా ఉండాలని హౌతీ వర్గాలు కోరినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. యెమెన్ భూభాగంలోకి విదేశీ దళాలు ప్రవేశిస్తే తమ దేశ రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించినట్లు సమాచారం.
మరోవైపు.. సౌదీ అరేబియా రక్షణకు సంబంధించి పాకిస్థాన్, టర్కీ నుంచి ఎలాంటి సైనిక సహాయం అందించాలనే అంశంపై ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. టర్కీ మాత్రం సౌదీకి సైనిక అవసరాల విషయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ప్రకటించింది.
దీంతో మక్కా రక్షణ ఒప్పందం నిజంగా యెమెన్ యుద్ధంలో ఎలా అమలవుతుంది? పాకిస్థాన్, టర్కీ నేరుగా రంగంలోకి దిగుతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply