మధ్యప్రాచ్య రాజకీయాల్లో దశాబ్దాల కాలం నాటి సంబంధాల పునాదులను కదిలించే ఒక పెద్ద కుదుపు సంభవించింది. ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రధాన వ్యూహకర్త మరియు విశ్లేషకుడు అబ్దుల్ ఖలిక్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. “యూఏఈకి ఇకపై తన రక్షణ కోసం అమెరికా అవసరం లేదు” అని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
యూఏఈలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇప్పుడు అమెరికా తన సైనిక స్థావరాలను మూసివేసి ఇక్కడి నుండి నిష్క్రమించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
సైనిక స్థావరాలు ఇక ‘ఆస్తి’ కాదు, ‘భారం’!
యూఏఈ ప్రముఖ వ్యాఖ్యాత అబ్దుల్ ఖలిక్ అబ్దుల్లా సోషల్ మీడియా మరియు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. అమెరికా సైనిక స్థావరాలు ఇప్పుడు వ్యూహాత్మక ప్రయోజనం కంటే ‘భారం’గా మారాయని స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన 2,800 కంటే ఎక్కువ డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకోవడం ద్వారా యూఏఈ తనను తాను రక్షించుకోగలదని నిరూపించుకుందని అబ్దుల్లా వాదించారు. తమకు అమెరికా నుండి ఆధునిక ఆయుధాలు మరియు రక్షణ వ్యవస్థలు మాత్రమే కావాలని, వారి శాశ్వత సైన్యం అవసరం లేదని యూఏఈ పేర్కొంటోంది.
ఇరాన్ వాదన: ‘అల్ మిన్హాద్’ బేస్‌పై దాడి
ఈ చర్చకు ప్రధాన కారణం ఇరాన్ చేసిన వాదనలు. యూఏఈలోని అమెరికా కమాండ్ సెంటర్ ‘అల్ మిన్హాద్’ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ తెలిపింది. ఈ బేస్‌లు తమ భద్రతకు ముప్పు అని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా నష్టాన్ని ధృవీకరించనప్పటికీ, అమెరికా ఉనికి కారణంగా తాము అనవసరంగా ఇరాన్ లక్ష్యంగా మారుతున్నామనే భయం యూఏఈలో మొదలైంది.
‘డాలర్’కు స్వస్తి.. యువాన్‌కు పచ్చజెండా!
కేవలం సైనిక పరంగానే కాకుండా, ఆర్థిక రంగంలో కూడా యూఏఈ ట్రంప్ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. యుద్ధం కారణంగా డాలర్ సరఫరా ఆగితే, చమురు విక్రయాల కోసం తాము చైనా కరెన్సీ ‘యువాన్’ను ఉపయోగించడం ప్రారంభిస్తామని యూఏఈ అమెరికాను హెచ్చరించింది.
ట్రంప్ తప్పు: ఇరాన్‌పై దాడి చేయాలనే ట్రంప్ నిర్ణయం తమను సుదీర్ఘ ఆర్థిక మాంద్యంలోకి నెట్టిందని, దీని నుండి కోలుకోవడానికి ఇకపై అమెరికాపై ఆధారపడలేమని యూఏఈ అధికారులు భావిస్తున్నారు.
పెట్రో-డాలర్ యుగం ముగియనుందా?
దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలకు మరియు అమెరికాకు మధ్య ఒక ఒప్పందం ఉండేది- “మేము మీకు రక్షణ కల్పిస్తాము, మీరు చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలి.” కానీ ఇప్పుడు యూఏఈ రక్షణ కోసం తనపై తాను ఆధారపడుతూ, చమురు కోసం యువాన్ గురించి మాట్లాడుతోంది. ఒకవేళ అబుధాబి అమెరికా బేస్‌లను తొలగించి, యువాన్‌లో వ్యాపారం ప్రారంభిస్తే, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రాభవం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది.
