మామ విగతజీవిగా పడివుంటే పార్టీలో కోడలి డ్యాన్సులు.. 309 ఫోన్ కాల్స్, 49 వాట్సాప్ మెసేజ్‌లతో వీడిన హత్య గుట్టు.!

కాన్పూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వినీత్ మనోచా దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ హత్య వెనుక ఆయన కోడలు శాలు హస్తం ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తరచూ నైట్ పార్టీలకు వెళ్లే అలవాటున్న శాలును మామ వినీత్ మనోచా మందలించడమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోడలి కదలికలపై నిఘా ఉంచేందుకు మామ ఇంట్లో సీసీటీవీ (CCTV) కెమెరాలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శాలు, ఆయనను అంతమొందించేందుకు పక్కా వ్యూహం రచించింది.

ఈ ఘాతుకాన్ని అమలు చేసేందుకు మామ వద్ద గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగి విశాల్ గౌతమ్‌ను ఆమె పావుగా వాడుకుంది. గత మే 1వ తేదీ నుంచి హత్య జరిగిన రోజు వరకు శాలు, విశాల్‌లు 309 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా, హత్య ప్రణాళికకు సంబంధించి 49 వాట్సాప్ మెసేజ్‌లను కూడా శాలు పంపింది. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఆ మెసేజ్‌లన్నింటినీ ఆమె ఎప్పటికప్పుడు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో వాటిని రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

దాదాపు మూడు నెలలుగా పథకం రచించి శాలు ఈ కుట్రను అమలు చేసినట్లు విచారణలో బట్టబయలైంది. హత్యను అమలు చేసిన మాజీ ఉద్యోగి విశాల్ గౌతమ్‌తో శాలు ఎలా సంబంధం పెట్టుకుంది? ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా సహకరించారా? ఇందుకు సంబంధించి ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగస్వాములైన మిగతావారిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.

ఈ కేసులో శాలు భర్త సుబ్రత్ మనోచా పాత్రపై కూడా పోలీసులకు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు విశాల్‌కు సుబ్రత్ గతంలోనే రెండుసార్లు ఉద్యోగం ఇప్పించిన నేపథ్యం ఉండటంతో, ఆయనకు కూడా ఈ హత్యతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సుబ్రత్ కాల్ డేటా రికార్డులు (CDR), ఆయన కదలికలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేసులో సుబ్రత్‌కు సంబంధం లేదని పోలీసులు ఇప్పటివరకు క్లీన్‌చిట్ ఇవ్వకపోవడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

హత్య జరిగిన రాత్రి, ఔషధ వ్యాపారుల (ఫార్మా) కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన భారీ నైట్ పార్టీలో శాలు, ఆమె భర్త సుబ్రత్ పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు సాగిన ఆ విందులో.. ఎలాంటి బెరుకు, ఆందోళన లేకుండా భోజనం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలను నిగ్గుతేల్చేందుకు శాలును 15 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 100కు పైగా ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేశారు. విచారణలో శాలు ఇచ్చే సమాధానాలే ఈ కేసులో తదుపరి పురోగతిని నిర్దేశించనున్నాయి.


Posted

in

by

Tags: