కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026 రాష్ట్ర రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టించాయి. 294 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాల భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది.
మమత ఓటమి తర్వాత టీఎంసీలో చీలిక సంకేతాలు
ఈ ఘోర పరాజయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు. మరోవైపు, టీఎంసీలో భారీ చీలిక రాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపాయి. టీఎంసీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని కట్జూ సంకేతాలిచ్చారు.
మహువా మోయిత్రా, సాగరికా ఘోష్‌లపై కట్జూ కీలక వ్యాఖ్యలు
మార్కండేయ కట్జూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ.. “మహువా మోయిత్రా, సాగరికా ఘోష్, సాయోనీ ఘోష్ మరియు కునాల్ ఘోష్ వంటి బలమైన నాయకులు రాబోయే రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నా నాకు ఆశ్చర్యం కలగదు” అని పేర్కొన్నారు.
అత్యంత క్లిష్ట దశలో టీఎంసీ
టీఎంసీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో కట్జూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మరో పోస్ట్‌లో వ్యంగ్యంగా స్పందిస్తూ.. “టీఎంసీ నాయకులు ఇప్పుడు తామే ఎన్నికల్లో గెలిచామని ప్రకటించుకోవాలి, మిగతా ప్రపంచం ఏమైపోయినా వారికి అనవసరం” అని రాశారు.
దీదీ ఆటను దెబ్బతీసిన ఎన్నికల ఫలితాలు
మే 4 (సోమవారం) వెలువడిన ఫలితాల్లో బీజేపీ చారిత్రాత్మక ప్రదర్శన చేసింది. టీఎంసీకి కంచుకోటగా భావించే ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో కూడా బీజేపీ పాగా వేసింది. గతంలో ముర్షిదాబాద్‌లో 22 సీట్లకు గాను 20 గెలిచిన టీఎంసీ, ఈసారి కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్, సీపీఎంలు మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టాయి.
అధీర్ రంజన్ చౌదరి ఓటమి – కొత్త రాజకీయ సమీకరణాలు
ఈ ఎన్నికల్లో పలువురు ఉద్ధండులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తన సొంత నియోజకవర్గం బహరంపూర్ నుండి ఓడిపోయారు. టీఎంసీ మాజీ నేత హుమాయూన్ కబీర్ తన కొత్త పార్టీ ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’ (AJUP) ద్వారా రెండు స్థానాల్లో విజయం సాధించి మమతా బెనర్జీకి గట్టి సవాలు విసిరారు. ముస్లింలను మమత కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, అందుకే ఈ ఫలితం వచ్చిందని కబీర్ విమర్శించారు.
