చాలామంది తమ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లేదా చిరునామా మార్చుకోవడానికి ఇప్పటివరకు మీ-సేవా కేంద్రాలకో లేదా ఆధార్ సేవా కేంద్రాలకో వెళ్లేవారు. ముఖ్యంగా మొబైల్ నంబర్ మార్చాలంటే, ఒక రోజంతా ఆధార్ కేంద్రం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా వివరాలను మార్చుకునేలా కొత్త ‘ఆధార్’ (mAadhaar) యాప్ అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా ఆధార్ సవరణల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చోట్ల రోజుకు 50 నుండి 100 టోకెన్లు మాత్రమే ఇస్తారు. దానికోసం ఉదయం 8 గంటలకే క్యూలో నిలబడాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ లేదా మొబైల్ నంబర్ మార్పు కోసం లైన్లలో వేచి ఉండాలి.
పుట్టిన తేదీ మరియు ఇతర సవరణలు: పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటిపేరు మార్చాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదా తహసీల్దార్ ధృవీకరణ అవసరమవుతుంది. ఒకవేళ చిన్నతనంలో మార్చలేకపోతే, ఆ బిడ్డ పదో తరగతి పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇటువంటి కఠినమైన నిబంధనల వల్ల ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త ఆధార్ యాప్‌తో చిరునామా మార్పు: ఆధార్ సేవలను సులభంగా, సురక్షితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త యాప్ రూపొందించబడింది.
- ఈ యాప్ ద్వారా మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను ఒకే చోట నిర్వహించవచ్చు.
- మీ ఆధార్ వివరాలను ఎవరు చూడవచ్చో మీరే నిర్ణయించవచ్చు.
- మీ కంటి పాప (Iris) మరియు వేలిముద్రల (Biometrics) సమాచారాన్ని ఏ సేవలకు అనుమతించాలో కూడా మీరే నియంత్రించవచ్చు.
- ముఖ్యంగా మొబైల్ నంబర్ మరియు చిరునామా మార్పు కోసం ఇకపై ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.
