ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లో అమెరికా (USA) పై 29 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో సరదాగా గడిపిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ బస్సులో సూర్య అర్ష్‌దీప్‌ను ఆటపట్టస్తూ.. “నీ నుండే నాకు కొంచెం మోటివేషన్ లభించింది. 8వ నంబర్ బ్యాటింగ్‌లో నీ స్థానాన్ని నువ్వు సంపాదించుకున్నావు” అని నవ్వుతూ అన్నాడు. అర్ష్‌దీప్ లోయర్ ఆర్డర్‌లో వచ్చి ఆడిన తీరును ఉద్దేశించి సూర్య ఈ సరదా వ్యాఖ్యలు చేశాడు. “నువ్వు ఎక్కడైతే ఫోర్ కొట్టావో, అక్కడి నుండే గేమ్ మారిపోయింది” అంటూ సూర్య ఆటపట్టించడం అభిమానులను అలరిస్తోంది.
మ్యాచ్ విశేషాలు: టాప్ ఆర్డర్ విఫలమైన వేళ, సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకున్నాడు. దీనివల్ల భారత్ 161/9 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ రాణించడంతో అమెరికాను 132/8 పరుగులకు కట్టడి చేసి భారత్ విజయం అందుకుంది.
బూమ్రాను అనుకరించిన సూర్య: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగిన ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో కూడా సూర్య అందరినీ నవ్వించాడు. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ స్టైల్‌ను సూర్య అచ్చుగుద్దినట్లు అనుకరించి తోటి కెప్టెన్లను, అభిమానులను ఖుషీ చేశాడు. బూమ్రా రన్-అప్ మరియు విభిన్నమైన యాక్షన్‌ను సూర్య కాపీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
