‘మీరు మసాజ్ పార్లర్లలో వ్యభిచారం చేస్తారు’: అరుణాచల్ మహిళలపై ఢిల్లీ దంపతుల వేధింపులు – దేశవ్యాప్తంగా నిరసనలు

ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మహిళలను వారి పొరుగువారు జాతి వివక్షతో దూషించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ‘సెక్స్ వర్కర్లు’ అని సంబోధించినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ వివాదం చెలరేగింది.

ఈశాన్య ప్రాంతానికి చెందిన ‘బూంగ్’ అనే చిత్రం ఉత్తమ చిల్డ్రన్ ఫిల్మ్ విభాగంలో బాఫ్టా (BAFTA) అవార్డు గెలుచుకుని దేశం గర్వపడుతున్న తరుణంలోనే, ఈ జాత్యహంకార ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

అసలేం జరిగింది? ఫిబ్రవరి 20న ఈ మహిళల అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నప్పుడు ఈ గొడవ మొదలైంది. డ్రిల్లింగ్ చేయడం వల్ల వచ్చిన దుమ్ము తమ బాల్కనీలో పడిందని కింది పోర్షన్లో ఉండేవారు గొడవకు దిగారు. బాధితులు క్షమాపణలు చెప్పినప్పటికీ, నిందితులు రెచ్చిపోయి వారిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

“మీరు మసాజ్ పార్లర్లలో రూ. 500లకే వ్యభిచారం చేస్తారు. ఇంట్లోనే మసాజ్ పార్లర్ తెరిచారా?” అని ఒక మహిళ అనడం సోషల్ మీడియాలోని వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా, “నా భర్తతో పడుకో, అతని బలం ఏంటో తెలుస్తుంది” అని కూడా సదరు మహిళ అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం కలకలం రేపింది.

చట్టపరమైన చర్యలు: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈశాన్య ప్రజలపై వివక్ష ఆగాలని ఆయన పేర్కొన్నారు. మాలవీయ నగర్ పోలీసులు హర్ష్ సింగ్ మరియు అతని భార్య రూబీ జైన్‌లపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 79, 351(2), 3(5), మరియు 196 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.


Posted

in

by

Tags: