ముందుగా భర్త పేరుతో రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, తర్వాత హత్య! ప్రియుడితో కలిసి హాయిగా ఉండాలని భర్తను చంపేసిన భార్య

తెలంగాణ మర్డర్ కేస్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒక భార్య తన ప్రియుడి కోసం భర్తను అత్యంత క్రూరంగా హత్య చేయించింది. హత్య చేసిన తర్వాత దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు, హత్యకు ముందే భర్త పేరు మీద రూ. 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి, ఆయన చనిపోయిన తర్వాత ఆ మొత్తాన్ని పొందాలని ప్లాన్ చేసింది. ఈ ఘటన హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో జరిగింది.

గుడిపేటకు చెందిన సాయిని కుమార్ మే 22న జాతీయ రహదారిపై ముల్కల్ల సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. కుమార్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ రోజు పని నిమిత్తం బైక్‌పై మంచిర్యాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆయన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ రిఫర్ చేయగా, మార్గమధ్యలోనే ఆయన మరణించారు.

తల్లికి అనుమానం.. ప్రారంభంలో ఇది రోడ్డు ప్రమాదమని అందరూ భావించారు, కానీ మృతుడి తల్లి సాయిని లక్ష్మికి కొడుకు మరణంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయిని కుమార్ మరణం ప్రమాదం కాదని, అదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని, దీనికి ప్రధాన నిందితురాలు ఆయన భార్య భారతి అని తేలింది.

ఏడేళ్లుగా ప్రేమాయణం.. 2002లో సాయిని కుమార్, భారతికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. పదేళ్ల పాటు వారి దాంపత్యం బాగానే సాగింది. కానీ 2012లో భారతికి అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఈ విషయం తెలిసిన కుమార్ మానసిక వేదనకు గురై మద్యానికి బానిసయ్యారు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.

రూ. 10 లక్షల సుపారీ.. కుమార్ వ్యవసాయం కోసం రామ్ మల్లేష్ అనే వ్యక్తి దగ్గర రూ. 60 వేలు అప్పు చేశారు. ఆ అప్పు తీర్చే విషయంపై భారతి భర్తకు నమ్మకం కలిగించింది. భర్తకున్న మద్యం అలవాటు, అప్పులను ఆసరాగా చేసుకుని భారతి హత్యకు కుట్ర పన్నింది. భర్త పేరు మీద రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి, రామ్ మల్లేష్‌కు హత్య చేయడానికి రూ. 10 లక్షల ‘సుపారీ’ ఇచ్చింది. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా రూ. 2 లక్షలు కూడా చెల్లించింది.

రాడ్‌తో దాడి.. పోలీసుల కథనం ప్రకారం, మే 22న రాత్రి నిందితులు కుమార్ కు మద్యం తాగించి, ముల్కల్ల గ్రామం శివారులో ఇనుప రాడ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఆయన చనిపోయాడని భావించి, రోడ్డు ప్రమాదంగా కనిపించేలా మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది.

తన ప్రియుడు సురేందర్‌తో కలిసి హాయిగా ఉండాలని భావించి, భర్తను అడ్డు తొలగించుకున్నట్లు భారతి నేరాన్ని అంగీకరించింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, నగదు, బైక్, మొబైల్ ఫోన్లు మరియు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.


Posted

in

by

Tags: