2002వ సంవత్సరంలో ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా అశుతోష్ జీవితంలోకి ప్రవేశించిన ఆ యువతి స్వరంలోనే ఆయన తన జీవిత భాగస్వామిని చూసుకున్నారు.
వేర్వేరు సామాజిక నేపథ్యాలు ఉన్నప్పటికీ, మహాష్టమి పర్వదినాన ఆమె సహజమైన రూపాన్ని, నిష్కల్మషమైన చూపులను ప్రత్యక్షంగా చూసిన మరుక్షణమే ఆయన తన మనసును ఆమెకు సమర్పించుకున్నారు. ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి గర్వం లేని ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం, తనకు ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్ (చేపలు) తినే అలవాటును సైతం పూర్తిగా మానేసి పక్కా శాఖాహారిగా మారారు. అలా పరిచయమైన కేవలం రెండు నెలల్లోనే ఆమె చేతిని అందుకుని ఏడడుగులు నడిచారు.
కవిత్వం, సంగీతం అంటే అమితమైన ఆసక్తి చూపే ఆమెతో గడిపిన 18 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తన జీవితకాల వరంగానే ఆయన భావిస్తున్నారు. అయితే 2021లో కరోనా మహమ్మారి ఆమె ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేసినప్పటికీ.. వారి 25వ వివాహ వార్షికోత్సవం కోసం ఆమె రాసిన ప్రేమలేఖలను అపురూపమైన నిధులుగా దాచుకుంటూ ఆయన నిత్యం కన్నీటి జ్ఞాపకాలతో బతుకుతున్నారు. వచ్చే జన్మలోనూ ఆమెనే తన భార్యగా రావాలని కోరుకుంటున్న అశుతోష్ నిస్వార్థ ప్రేమ, ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఈ భావోద్వేగ జీవన ప్రయాణం నెటిజన్లను ఎంతగానో కదిలిస్తోంది. కాలానికి సైతం చెరగని ఆయన అమర ప్రేమకు సెల్యూట్.

Leave a Reply